పెనుకొండ/హిందూపురం: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు శుక్రవారం నేత్రపర్వంగా సాగాయి. మండల కేంద్రం సోమందేపల్లిలో శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపుగా తీసుకురాగా, తొగటవీర క్షత్రియులు తలలపై జ్యోతులు ఉంచుకుని నృత్యం చేస్తూ ముందుకు సాగారు. వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి ఉత్సవాన్నిచూసి పులకించిపోయారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య, తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సీసీ హరిదాస్, డీఏ నారాయణస్వామి తదితరులు పర్యవేక్షించారు. అలాగే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో తోగట వీరక్షత్రియుల ఆరాధ్యదైవమైన చౌడేశ్వరిదేవి జ్యోతుల ఉత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామునే ఆలయంలో మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించిన అనంతరం 3 గంటల సమయంలో జ్యోతులను తలలపై ఎత్తుకుని నృత్యం చేస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం జంతు బలులతో మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా జనం తరలి రావడంతో ముదిరెడ్డిపల్లి జనసంద్రమైంది. భక్తులకు మజ్జిగ, తాగునీరు, చల్లని పానీయాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జయరాములు, ఆలయ కమిటీ నాయకులు బండారు బాలాజీ, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, నాగభూషణరెడ్డి ఆర్‌పీ భాస్కర్, మనోహర్, సాయితేజా శ్రీనివాస్ పాల్గొన్నారు.
● హిందూపురం మండలం కొటిపి గ్రామంలో చౌడేశ్వరీ దేవి రథోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయంలో మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని రథంపై అధిష్టింపజేసి పురవీధుల్లో భక్తులు లాగారు. వడి బియ్యం సమర్పిణ, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు.
సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లిలో వైభవంగా జ్యోతుల ఉత్సవం
కొటిపిలో నేత్రపర్వంగా సాగిన రథోత్సవం


