హిందూపురం: జిల్లాలో పెద్ద పట్టణమైన హిందూపురంలో తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యం ప్రధాన అంశాలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన హిందూపురం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హిందూపురం మున్సిపాలిటీలో వివిధ సమస్యలపై ఆరు నెలలుగా సమీక్షలు నిర్వహిస్తున్న దృష్ట్యా ఇక్కడి పరిస్థితులు, సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అనుభవం కలిగిన కమిషనర్ మల్లికార్జున, అధికారులు, ప్రజలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతూ మెరుగైన పాలన అందిస్తామన్నారు. ముఖ్యంగా పట్టణాన్ని శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు. పట్టణంలో రోజువారీ చెత్త సేకరణను కచ్చితంగా అమలయ్యేలా చూస్తామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వార్డుకు సమయానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా లీకేజీలుంటే మరమ్మతు చేసి నీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల మరమ్మతులపై కూడా దృష్టి సారిస్తామన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధానం అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, పలువురు అధికారులు పాల్గొన్నారు.
స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్


