హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన

Mar 21 2026 4:50 AM | Updated on Mar 21 2026 4:50 AM

యాడికి: ఉగాది పండుగ సందర్భంగా యాడికి మండలం రాయలచెరువులోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు 14 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ప్రథమ స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకట సుబ్బారెడ్డి వృషభాలు నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లి రైతు నాగయ్య వృషభాలు, తృతీయ స్థానంలో వైఎస్సార్‌ కడప జిల్లా అక్కంపేట గ్రామ రైతు ఆదిల్‌ వృషబాలు, నాల్గో స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకటసుబ్బారెడ్డి రెండో జత వృషబాలు, ఐదో స్థానంలో గార్లదిన్నె మండలానికి చెందిన రైతు రామాంజనేయులు వృషభాలు, ఆరో స్థానంలో తాడిపత్రిలోని గన్నేవారిపల్లి రైతు రమేష్‌బాబుయాదవ్‌ వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో కొండుపల్లి చిలమకూరు జయప్రకాష్‌, ముత్తలూరు నరేష్‌ చౌదరి, న్యూ వికాష్‌ స్కూల్‌ రామకృష్ణ, జొన్నల వ్యాపారి పెద్దన్న, రాజ పుల్లయ్య, రంగస్వామి, నాగరంగయ్య, మదమంచి శివప్రసాదనాయుడు సత్యరించారు.

నేత్రపర్వంగా నెట్టికంటుడి రథోత్సవం

గుంతకల్లు రూరల్‌: ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. ఆంజనేయ రక్షమాం.. పవన పుత్ర పాహిమాం అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. శుక్రవారం వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పుష్పాలతో అలకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాన్ని నిలిపి రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి ఆలయ పురవీధుల్లో భక్తులు లాగారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మరూరు జయరాం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ పర్యవేక్షించారు.

ఉల్లాసంగా ఉట్ల పరుష

బుక్కరాయసముద్రం: ఉగాది పండుగ సందర్భంగా శుక్రవారం బుక్కరాయసముద్రంలో ఉట్ల పరుష ఉల్లాసంగా సాగింది. స్టేట్‌ బ్యాంక్‌ ఎదుట ఉట్ల మాను ఏర్పాటు చేసి, ఎక్కడానికి యువకులు పోటీ పడ్డారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement