పెనుకొండ రూరల్: నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటున్న ముస్లింలకు పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేవీ ఉష శ్రీచరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
దెబ్బతిన్న పంటల పరిశీలన
ముదిగుబ్బ: అకాల వర్షాల కారణంగా మండలంలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, వ్యవసాయ శాస్త్రవేత్తలు రామసుబ్బయ్య, కిరణ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు. అనంతరం నల్లచెర్లోపల్లిలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ రవీంద్ర, విస్తరణ అధికారి మనోహర్, ఉద్యానశాఖ సిబ్బంది ప్రియాంక, వీఆర్‌ఓ చరణ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత
శిబిరానికి ధర్మవరం విద్యార్థి
ధర్మవరం అర్బన్: ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత శిబిరానికి ధర్మవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సాకే నరహరి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా నరహరిని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరరెడ్డి, అధ్యాపకులు శుక్రవారం అభినందించారు. ఏపీ నుంచి 10 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఎంపిక కాగా, అందులో తమ కళాశాల విద్యార్థి ఉండటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్‌నాయక్, అధ్యాపకులు కిరణ్‌కుమార్, త్రివేణి, షమీవుల్లా, పావని, భువనేశ్వరి, హైమావతి, పుష్పావతి, సరస్వతి, ఆనంద్, మీనా, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
గుత్తి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని సీపీఐ కాలనీకి చెందిన రమేష్ (40) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు ప్రాధేయపడడంతో ఇటీవల మద్యం తాగడాన్ని పూర్తిగా మానేశాడు. అయితే స్వీయ నియంత్రణ కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబసభ్యులు అతన్ని ఇంటి నుంచి బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటపడిన రమేష్ నేరుగా తురకపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అప్పటికే పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, రమేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.


