పదిలో ప్రైవేటు పెత్తనం | - | Sakshi
Sakshi News home page

పదిలో ప్రైవేటు పెత్తనం

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

పదిలో

పదిలో ప్రైవేటు పెత్తనం

పుట్టపర్తి: జిల్లాలో ఈ నెల 16న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 344 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 15,323 మంది విద్యార్థులు, 154 ప్రైవేటు పాఠశాలల నుంచి 6,816 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటి వరకూ పది పరీక్షల ఇన్విజిలేషన్‌ విధులను ప్రభుత్వ ఉపాధ్యాయులే నిర్వర్తించేవారు. ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు పాఠశాలల టీచర్లకు కూడా ఇన్విజిలేషన్‌ విధుల్లో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. చీఫ్‌ సూపరింటెండెంట్లు (సీఎస్‌), డిపార్ట్‌మెంటల్‌ అధికారులు (డీఓ), ఇన్విజిలేటర్లగా ప్రైవేట్‌ పాఠశాలల టీచర్లను తీసుకోనున్నారు.

సర్వత్రా ఆందోళన..

చంద్రబాబు సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటుకు పెత్తనం కడితే ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుందని పలువురు అంటున్నారు. జిల్లాలో 2012 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా రెండేళ్లలో 67 పాఠశాలలు మూతపడ్డాయి. 232 పాఠశాలల్లో ప్రస్తుతం 10 మంది లోపు విద్యార్థులు ఉండడంతో వాటిని కూడా మూసేస్తారనే అనుమానాలు ఉన్నాయి. ప్రైవేటు ఉపాధ్యాయులకు పది పరీక్షల్లో పెత్తనం ఇస్తే ఆయా పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం ఖాయమని, ఈ క్రమంలో తల్లిదండ్రులు వాటి వైపే మొగ్గు చూపుతారని, దీంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాల్సి వస్తుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి విద్యా ప్రమాణాలు లేని విద్యార్థులను పాస్‌ చేసి ఇంటర్‌లో చేర్చడం ద్వారా ‘కార్పొరేట్‌’ వ్యాపారాన్ని మరింత విస్తరించినట్లు అవుతుందని చెబుతున్నారు.

కొత్త విధానాలు తెరపైకి..

కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కావాలనే మేలు చేకూర్చేలా, ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చేలా చంద్రబాబు ప్రభుత్వం కొత్త విధానాలు తెరపైకి తెస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులతో సంబంధం లేకుండా రాష్ట్రస్థాయిలోనే పది పరీక్షల ఇన్విజిలేటర్లను నియమించేలా తీసుకొచ్చిన ఆటోమేషన్‌ విధానమే ఇందుకు నిదర్శనమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. తమకు అనుకూలమైన వారిని ఇన్విజిలేషన్‌ విధుల్లో నియ మించి కార్యక్రమాలను చక్కబెట్టుకుంటారంటూ పెదవి విరుస్తున్నారు.

ప్రతి విషయంలో ప్రైవేటు జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చివరకు పది పరీక్షల్లో సైతం ప్రైవేటు పెత్తనం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు ఉపాధ్యాయులు పది పరీక్షల ఇన్విజిలేషన్‌లో పాల్గొనేలా సమాయత్తం చేస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను కాదని ప్రైవేటు టీచర్లను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తమ డిమాండ్లు నెరవేర్చాలని ధర్నాలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. మరోవైపు ప్రైవేటుకు పెద్దపీట

వేస్తుండడంపై మండిపడుతున్నారు.

జిల్లాలో 16 నుంచి పది పరీక్షలు

తొలిసారిగా ప్రైవేటు టీచర్లకు ఇన్విజిలేషన్‌ విధులు

చంద్రబాబు సర్కారు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

ప్రభుత్వ విద్యావ్యవస్థ

నిర్వీర్యమవుతుందని ఆందోళన

ఆటోమేషన్‌ పద్ధతి సరికాదు

పది పరీక్షల ఇన్విజిలేషన్‌ విధులకు సంబంధించి ప్రభుత్వం ఆటోమేషన్‌ విధానం తీసుకురావడం సరికాదు. ఈ పద్ధతితో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమ వుతాయి. పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే జిల్లాలో 67 పాఠశాలలు మూతపడ్డాయి. అనాలోచిత నిర్ణయాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

– హరిప్రసాద్‌రెడ్డి,

ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

పేద పిల్లల చదువులు

కుంటుపడతాయి

చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కటీ పరిష్కరించలేదు. నిత్యం తాము రోడ్డెక్కుతున్నా పట్టించుకోవడం లేదు. ఇలాగే కొనసాగితే పేదల పిల్లల చదువులు కుంటుపడతాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. యాప్‌లు, విద్యాయేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను వినియోగించుకోవడం మానుకోవాలి.

– సుధాకర్‌,

యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

పదిలో ప్రైవేటు పెత్తనం 1
1/2

పదిలో ప్రైవేటు పెత్తనం

పదిలో ప్రైవేటు పెత్తనం 2
2/2

పదిలో ప్రైవేటు పెత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement