నేటి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి: జిల్లాలో సోమవారం నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ లాజర్ పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పుట్టపర్తి మండలం ఎనుములపల్లి, కదిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు, పెనుకొండలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, తోటగిరిలో రెండు, మడకశిరలో ప్రభుత్వ పాఠశాలలో ఒక సెంటర్ కలిపి ఆరు కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు.హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. తప్పుడు పద్ధతిలో ఎవరైనా పరీక్షకు హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బెంగళూరులో బత్తలపల్లి
యువకుడి దుర్మరణం
బత్తలపల్లి: కర్ణాటక రాజధాని బెంగుళూరులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన మాజీ బీఎస్‌ఎఫ్ జవాన్ నరసింహులు కుమారుడు రఘువంశీ (21) బెంగుళూరులోని అలియాన్స్ యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం కళాశాల నుంచి ద్విచక్రవాహనంలో తన రూముకు తిరిగి వెళుతున్న సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన టిప్పర్ బలంగా ఢీ కొంది. దీంతో తీవ్ర గాయాలైన రఘువంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కుమారుడు కళ్ల ముందు విగతజీవిగా పడి ఉండడం చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.
కరిపులి క్వింటా
@ రూ.22 వేలు
హిందూపురం: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం 3,650 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. మొదటి రకం కరిపులి క్వింటాలు గరిష్ట ధర రూ.22,000 పలికింది. కనిష్టం రూ.10,100, సరాసరి రూ.12,600 చొప్పున క్రయ విక్రయాలు సాగాయి. రెండో రకం ఫ్లవర్ క్వింటాల్ గరిష్ట ధర రూ.13,000 పలికింది. కనిష్టం రూ.6 వేలు, సరాసరి రూ.7,500 పలికినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. మార్కెట్‌లో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండు మిర్చి క్రయ విక్రయాలు జరుగుతాయని, రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు.
నేడు మార్కెట్‌కు సెలవు..
కదిరిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్‌యార్డులో సోమవారం జరగాల్సిన చింతపండు క్రయవిక్రయాలను ఆదివారమే ముగించారు. గురువారం యథావిధిగా కార్యకలాపాలు సాగుతాయని చెప్పారు.
పీఏబీఆర్‌లో
పడిపోతున్న నీటి మట్టం
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) లో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ఆదివారం నాటికి జలాశయంలో 3.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా డ్యాంలోకి 300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ధర్మవరం కుడి కాలువకు 630 క్యూసెక్కులు, వివిధ తాగునీటి ప్రాజెక్టులకు కలిపి 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీలు, నీటి ఆవిరి రూపంలో 95 క్యూసెక్కులు బయటకు వెళుతోంది. నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ వేసవిలో తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు.
నేటి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు
నేటి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు


