గుక్కెడు నీళ్లూ సరఫరా చేయలేరా?
గుడిబండ: గుక్కెడు మంచి నీళ్లు కూడా సరఫరా చేయలేరా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మండల పరిధిలోని జంబులబండ గ్రామ ప్రజలు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ జంబులబండ గ్రామంలో తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు కూడా లేవన్నారు. చాలా రోజులుగా అవస్థలు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలతో మడకశిర, అమరాపురం రహదారిపై బైఠాయించడంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.


