నెమలిని రక్షించిన గ్రామస్తులు
నల్లచెరువు: జాతీయపక్షి నెమలిని కుక్కల దాడి నుంచి గ్రామస్తులు రక్షించారు. నల్లచెరువు మండలం దేవిరెడ్డి పల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం పొలాల్లోకి వచ్చిన నెమలిపై కుక్కలు దాడి చేసి కొరుకుతుండగా గ్రామస్తులు గమనించి వాటిని తరిమేశారు. గాయపడిన నెమలిని అటవీశాఖ అధికారులకు సురక్షితంగా అప్పగించారు.
వాహనం ఢీకొని జింక మృతి
చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. శుక్రవారం ఉదయం జింక కళేబరాన్ని కుక్కలు పీక్కు తింటుండగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత విలవిల్లాడి ప్రాణాలొదిలినట్టుగా అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది.
యువకుడి బలవన్మరణం
పెనుకొండ(సోమందేపల్లి): మండల కేంద్రం సోమందేపల్లిలోని నక్కలగుట్ట కాలనీలో నివాసముంటున్న వడ్డె మారుతి (26) ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసగా మారి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కుటుంబ పోషణను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తాగుడుకు డబ్బు కావాలని కుటుంబసభ్యులను అడిగితే వారు లేవన్నారు. దీంతో క్షణికావేశానికి లోనైన మారుతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు సమాచారంతో సోమందేపల్లి పీఎస్ ఎస్‌ఐ రమేష్‌బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై
‘పచ్చ’ మూక దాడి
కనగానపల్లి: మండలంలోని బద్దలాపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాయల ప్రకాష్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన చిన్నరాజన్న కుమారుడు ప్రకాష్ శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఆట స్థలంలో క్రికెట్ ఆడుకుంటుండగా టీడీపీ కార్యకర్తలు దాసరి సింహాద్రి, అర్జున్, తరుణ్ అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో వారు అకారణంగా ప్రకాష్‌తో గొడవ పెట్టుకుని వికెట్లు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని దాడిని అడ్డుకుని తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌ను వెంటనే ఽఅనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజకీయ, వర్గ కక్షలతోనే టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారని వైఎస్సార్‌సీపీ నాయకులు నరసింహులు, చండ్రాయుడు, సురేష్ విమర్శించారు.
సైనికుల సంక్షేమానికి చర్యలు
● ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కెప్టెన్ సత్యప్రసాద్
అనంతపురం సెంట్రల్: సైనికులు, మాజీ సైనికులు, వీర నారీమణుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కెప్టెన్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఫిజికల్ క్యాజువాల్టీ ఆర్థిక సాయం కింద శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన శ్రావణికి రూ. లక్ష, అనంతపురానికి చెందిన మాజీ సైనికుడు భార్య పార్వతికి రూ. లక్ష చొప్పన అందించారు. అనంతరం టవర్‌క్లాక్ సమీపంలో రహదారి విస్తరణలో భాగంగా కూల్చేసిన సైనిక సంక్షేమ కార్యాలయాన్ని పరిశీలించి, పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ, పలువురు సైనిక సంక్షేమ అధికారులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.
నెమలిని రక్షించిన గ్రామస్తులు


