3న గూగూడు ఆలయాల మూత
శింగనమల(నార్పల): చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న నార్పల మండలంలోని గూగూడులో వెలసిన కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలను మూసి వేస్తున్నట్లు ఆలయ ఈఓ శోభ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయాలను మూసివేయనున్నారు. ఆలయ శుద్ది అనంతరం 4న ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనం కల్పించనున్నారు.
గుండెజబ్బు బాధిత టీచర్లను
మినహాయించండి
● డీఈఓకు విన్నవించిన ఎస్టీయూ
పుట్టపర్తి: త్వరలో జరిగే పదో తరగతి పరీక్షలకు గుండెజబ్బుతో బాధపడుతున్న టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం డీఈఓను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ ఏడాది పరీక్షల విధుల కేటాయింపులో తీసుకువచ్చిన కేంద్రీకృత విధానం అశాసీ్త్రయంగా ఉందని మండి పడ్డారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతపరిచినా మినహాయింపు ఇవ్వక పోవడం దారుణమన్నారు. వివిధ అనారోగ్య సమస్యలకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయులను ప్రత్యేక పరిస్థితుల కింద పరిగణిస్తూ వారికి పదో తరగతి పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. 8 కిలోమీటర్లు పైబడి దూరంలో ఉన్న పరీక్ష కేంద్రాలకు వెళ్లే ఉపాధ్యాయులకు టీఏ, డీఏ సౌకర్యం కల్పించాలన్నారు. ఒకే పాఠశాలలో పని చేస్తున్న వారిలో ఎక్కువ మందిని పరీక్ష విధులకు కేటాయిస్తే బోధనకు ఆటంకం కలుగుతుందన్నారు. ఉపాధ్యాయుల వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో కొత్తచెరువు మండల ఎస్టీయూ అధ్యక్షుడు శివయ్య, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖలో
పదోన్నతులు
కడప రూరల్: వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు దక్కాయి. శుక్రవారం కడపలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్‌లో పదోన్నతుల కౌన్సెలింగ్ చేపట్టారు. జోన్–4 పరిధిలోని రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్న మొత్తం 44 మందికి గాను 33 మంది పదోన్నతులు స్వీకరించారు. జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పదోన్నతుల కౌన్సెలింగ్ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్లు సుఖేష్, వనీష, రవికుమార్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
3న గూగూడు ఆలయాల మూత


