రమణీయం.. రథోత్సవం
హేమావతి(అమరాపురం): హేమావతి హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి చిన్నరథోత్సవం రమణీయంగా సాగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో పాటు వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని తరించారు. సాయంత్రం ఆలయ కమిటీ అధ్యక్షుడు కరేగౌడ, ఈఓ నరసింహరాజు ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు పూలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో ఆలయం ఆవరణలో ఉన్న చిన్న రథోత్సవం వద్దకు తీసుకొచ్చి పూజల అనంతరం రథంలో కొలువుదీర్చారు. శివ...శివ, సిద్ధేశ్వరస్వామి మహరాజ్‌కు జై అంటూ భక్తులు అరటిపండ్లు, పూలు, బెల్లం, బొరుగులు, జిలకర తదితర వాటిని రథంపైకి విసిరి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన స్వామివారి రథం హంపణ్ణస్వామి గుడి వరకూ సాగింది. రథోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు స్వామివారిని కీర్తించగా ఆ ప్రాంతమంతా సిద్ధేశ్వరుడి నామం ప్రతిధ్వనించింది. రాత్రి స్వామివారిని ముత్యాలపల్లకీలో కొలువుదీర్చి పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగించారు. సర్పంచ్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు బ్రహ్మరథోత్సవం..
ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ నరసింహరాజు, ఆలయ కమిటీ చైర్మన్ కరేగౌడ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హేమావతికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు మడకశిర ఆర్టీసీ డీఎం రంగభాష్యం తెలిపారు.
వైభవంగా హెంజేరు సిద్ధేశ్వరస్వామి
చిన్నరథోత్సవం
రమణీయం.. రథోత్సవం


