జీతాలివ్వకపోతే ఎలా బతకాలి?
పుట్టపర్తి అర్బన్: ‘‘నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఎలా పనిచేయాలి. మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. జీతాల గురించి ఎవరిని అడిగినా చెప్పడం లేదు. సర్వేలు, రికార్డులంటూ పని మాత్రం మరింత పెంచారు’’ అంటూ ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉండటంతో గురువారం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారంతా డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు వ్యక్తి గత వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆశావర్కర్లు మాట్లాడుతూ... 2025 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ తమకు జీతాలు ఇవ్వలేదన్నారు. నాలుగు నెలలు జీతం రాకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, మండల కేంద్రాలకు వచ్చిపోయేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. జీతం గురించి ఎవరిని అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. పెండింగ్ జీతాలు ఎప్పుడిస్తారో చెప్పే వరకూ కదిలేది లేదని భీష్మించారు. ఈ క్రమంలోనే అధికారులు, సీఐటీయూ నాయకులు, ఆశావర్కర్ల మధ్య సుమారు గంటకుపైగా వాదోపవాదాలు జరిగాయి. చివరకు మార్చినెల జీతాలతో పాటు పెండింగ్ ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ, ప్రధాన కార్యదర్శి సౌభాగ్య, కోశాధికారి రమాదేవి, అంజినమ్మ, ముంతాజ్, మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నరసింహులు, కోశాధికారి లక్ష్మీనారాయణ, యూనియన్ గౌరవాధ్యక్షులు సాంబశివ, పైపల్లి గంగాధర్, అంకే ముత్యాలు తదిత రులు పాల్గొన్నారు.
పెండింగ్ జీతాల కోసం
ఆశాల నిరసనాగ్రహం
డీఎంహెచ్‌ఓ కార్యాలయం ముట్టడి


