అనధికార వ్యక్తుల పెత్తనాన్ని సహించం
పెనుకొండ: తహసీల్దార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తుల పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. గురువారం ఆయన గోరంట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్‌ఓఆర్, పీజీఆర్‌ఎస్, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, పెండింగ్ ఫైళ్ల వివరాలు, రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీల పరిష్కార స్థితిని సమీక్షించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలతో నేరుగా మాట్లాడి.. వారి సమస్యలకు పరిష్కారం చూపాలని తహసీల్దార్ మధునాయక్‌ను ఆదేశించారు. కొన్ని విభాగాల్లో ఫైళ్లు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు.
అంగన్‌వాడీల్లో సదుపాయాలు కల్పించాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన సంబంధిత అధికారులతో వర్చువల్‌గా మాట్లాడారు. అంగన్‌వాడీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు లేకుండా ఏఈలు, డీఈలు పర్యవేక్షించాలన్నారు. స్థల వివాదాలు, భవన సమస్యలు, మరమ్మతులు తదితర సమస్యలను ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ధర్మవరం, హిందూపురం సబ్ డివిజన్‌లలో ఆర్థిక పురోగతిని పెంచాలన్నారు.
మెనూ పక్కాగా అమలు చేయాలి..
సంక్షేమ హాస్టళ్లలో మెనూ పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో వర్చువల్‌గా సమీక్షించారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో అమలు చేస్తున్న మెనూ, వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల పనితీరు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. వసతి గృహాల్లోని చిన్నారులకు శుద్ధజలం అందించేందుకు సీఎస్‌ఆర్ నిధుల నుంచి వాటర్ ఫ్యూరిఫయర్లు కొనుగోలు చేయాలన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఎక్కడైనా ట్యూటర్లు లేకపోతే వెంటనే నియమించుకోవాలన్నారు. బాలికల హాస్టళ్లలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలన్నారు. హెల్త్ చెకప్, తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.


