ఇసుక అక్రమ రవాణాను సహించం
● హెచ్చరించిన
పెన్నా పరివాహక ప్రాంత రైతులు
రొద్దం: ఇసుక తవ్వకాలతో భూగర్భజలమట్టం భారీగా పడిపోగా..రైతులు నష్టనివారణ చర్యలు తీసుకున్నారు. మండల కేంద్రం సమీపం పెన్నా పరివాహక ప్రాంతంలో వేసుకున్న ఫిల్ట్ బోర్ల వద్ద ఉన్న ఇసుక తరలించకుండా, ట్రాక్టర్లు పెన్నానదిలోకి రాకుండా ఉండటానికి నది గట్టున రోడ్డుపై పెద్ద గోతులు తీశారు. అయితే గురువారం పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన కొందరు గోతులను పూడ్చి ఇసుక తరలించడానికి ప్రయత్నించగా... రైతులు అడ్డుకున్నారు. ఇసుకాసురులకు రైతులకు వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికివెళ్లి ఇరువర్గాలతో మాట్లాడారు. పెన్నానదిలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా రైతులు తవ్విని గోతులను అలాగే ఉంచేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...పెన్నానుంచి ఇసుక అక్రమ రవాణాను సహించబోమన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా అడ్డుకుంటామన్నారు.
హిందూపురం కేంద్రంగా
ఆర్‌అండ్‌బీ డివిజన్
హిందూపురం: రోడ్లు భవనాల శాఖ పరిధిలో జిల్లాలో మరో డివిజన్ ఏర్పాటైంది. హిందూపురం కేంద్రంగా నూతన డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డివిజన్‌లో హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాలను చేర్చారు. ఆర్ అండ్ బీ నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని ఇటీవలే పెనుకొండ, మడకశిర ఎమ్మెల్యేలతో కలసి సీఎం చంద్రబాబుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విన్నవించారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


