శాశ్వత భవనాలకు మోక్షమెన్నడో?
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా 2022 ఏప్రిల్ 4వ తేదీన ఏర్పాటైంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు భవనాలను ఇవ్వడంతో వాటిలో ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పడి సుమారు నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కార్యకలాపాలను కొనసాగిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
భూములు కేటాయించినా..
గత ప్రభుత్వంలోనే పుట్టపర్తి సమీపంలో ప్రభుత్వ భవనాల కోసం స్థలాలు సేకరించడంతో పాటు రూ.100 కోట్లు మంజూరు చేశారు. కప్పలబండ రెవెన్యూ పొలం మామిళ్లకుంట క్రాస్ వద్ద 15.21 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించారు. అలాగే, జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణానికి ప్రశాంతిగ్రామం సమీపంలోని శిరసాని హిల్స్‌లో స్థలం చూపారు. సుమారు 17 ఎకరాలు కేటాయించి అప్పట్లోనే మూడు ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేశారు. రెండు నెలల పాటు హిటాచీలు, జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి కొండను చదును చేశారు. ప్రశాంతిగ్రామం వద్ద కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన భూమికి సమీపంలోనే ప్రశాంతి రైల్వే స్టేషన్, బుక్కపట్నం చెరువు, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సత్యసాయి విమానాశ్రయం ఉండడంతో పరిపాలనా పరంగా కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. కలెక్టరేట్ కార్యకలాపాలకు అవసరమైతే సమీపంలోనే మరికొంత భూమి అందుబాటులో ఉండడం గమనార్హం.
మారిన పరిస్థితి..
జగన్ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే ఇప్పటికే అన్ని భవనాలు అందుబాటులోకి వచ్చేవి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి వరకూ శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అలాంటిదేమీ లేదంటూ స్పష్టత రావడంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
జిల్లా ఏర్పాటై నాలుగేళ్లు
ఇప్పటికీ అద్దె భవనాల్లోనే
ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు
శాశ్వత భవన నిర్మాణాలపై దృష్టి సారించని చంద్రబాబు ప్రభుత్వం
గత ప్రభుత్వంలోనే స్థలాలు
కేటాయించినా నిర్లక్ష్యం
శాశ్వత భవనాలకు మోక్షమెన్నడో?
శాశ్వత భవనాలకు మోక్షమెన్నడో?


