ఎంటెక్, ఎమ్మెస్సీ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఎంటెక్ (ఆర్–21), రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ (ఆర్–21) నాలుగో సెమిస్టర్ (ఆర్–21), రెగ్యులర్, సప్లిమెంటరీ, మూక్స్ (కన్వెన్షనల్ మోడ్) ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు మంగళవారం విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ శంకర్ శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న 35 రోజులకు వెలుగులోకి మృతదేహం
హిందూపురం: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, 35 రోజుల తర్వాత మృతదేహం వెలుగుచూసింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కురుబ శ్రీనివాసప్ప (52), అంజనమ్మ దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. మగ్గం కార్మికుడైన శ్రీనివాసులు రూ.10 లక్షల దాకా అప్పులు చేశాడు. రెండేళ్లుగా మగ్గాల పనులు లేకపోవడంతో అప్పు ఎలా తీర్చాలో అంటూ నిత్యం మదనపడేవాడు. గత నెల 15వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలోనే మంగళవారం స్థానిక కొల్లగుంట సమీపంలోని కంపచెట్లలో ఓ వ్యక్తి లుంగీతో ఉరి వేసుకొన్న విషయం బయటకు వచ్చింది. అక్కడకు వెళ్లిన అంజనమ్మ ఉరికి వేలాడుతున్నది తన భర్తే అని గుర్తించింది. అయితే, మృతదేహం కుళ్లిపోయిన నేపథ్యంలో పోలీసులు ఎముకలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అప్పుల బాధ తాళలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అంజనమ్మ తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


