నకిలీ పత్రం.. దర్యాప్తు ముమ్మరం
మడకశిర: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జారీ అయిన సర్టిఫికెట్ల వివరాలను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నుంచి పోలీసు అధికారులు సేకరించినట్లు సమాచారం. ప్రధానంగా నకిలీ సర్టిఫికెట్లను ఎలా జారీ చేశారు? ఎలా వెలుగులోకి వచ్చింది? ఎన్ని నకిలీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి? ఏఏ రాష్ట్రాల వారు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు పొందారు? తదితర వివరాలను ఆరా తీసినట్లు తెలిసింది. దర్యాప్తునకు అవసరమైన అన్ని ఆధారాలను పోలీసులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందజేశారు. ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధానంగా సైబర్ నేరగాళ్ల పాత్రపై దృష్టి సారించడం గమనార్హం.
మూడు గ్రామ పంచాయతీ లాగిన్లే కీలకం..
జిల్లాలో మూడు గ్రామ పంచాయతీల లాగిన్‌ల నుంచి నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 4,026, రామనపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 2,898, బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 1,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు జిల్లా నోడల్ అధికారి కళాధర్ చేపట్టిన విచారణలో నిర్ధారణ అయింది. రాజస్తాన్, అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలువురు నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై తొలుత కొమరేపల్లి గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు అగళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బత్తలపల్లి పీఎస్‌లోనూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇక అగళి మండలంలోని రామనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జారీ అయిన సర్టిఫికెట్లకు సంబంధించి కొమరేపల్లి గ్రామ పంచాయతీ నకిలీ బర్త్‌సర్టిఫికెట్ల కేసుకు అనుబంధం చేస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది.
రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ..
కొమరేపల్లి, పోట్లమర్రి, రామనపల్లి గ్రామ పంచాయతీల లాగిన్‌ల నుంచి జారీ అయిన నకిలీ బర్త్ సర్టిఫికెట్లన్నీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రద్దు చేశారు. వీటి వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి ఆయా గ్రామ పంచాయతీల గ్రామ కార్యదర్శులు అందజేశారు. దీంతో మొత్తం 8,906 సర్టిఫికెట్లను అధికారులు రద్దు చేసి, వాటి వివరాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాస్‌పోర్టు అథారిటీ అధికారులకు, ఉదయ్ (ఆధార్) ఏజెన్సీ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేరవేశారు. వీటి ఆధారంగా పొందిన పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే నకిలీ సర్టిఫికెట్ల ద్వారా లబ్ధి పొందకుండా ఉండేందుకు దేశంలోని వివిధ కార్యాలయాలకు పంపుతున్నట్లు సమాచారం.
వైద్య ఆరోగ్యశాఖ నుంచి
వివరాలు సేకరించిన పోలీసు శాఖ
యూపీ, రాజస్తాన్, అసోం,
మహారాష్ట్రాల వారికి ఎక్కువగా జారీ
8,906 నకిలీ సర్టిఫికెట్లను
రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ
పాస్‌పోర్ట్ అథారిటీ,
ఆధార్ నమోదు కేంద్రాలకు
రద్దు చేసిన బర్త్ సర్టిఫికెట్ల వివరాలు
రద్దు చేశాం
జిల్లా నుంచి జారీ అయిన 8,906 నకిలీ బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేశాం వీటి వివరాలను పాస్‌పోర్టు అథారిటీ అధికారులు, ఉదయ్ ఏజెన్సీ అధికారులకు పంపాం. దర్యాప్తు వేగవంతం చేసేలా పోలీసు అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాం.
– డాక్టర్ ఫైరోజాబేగం, డీఎంహెచ్‌ఓ


