దళితులపై పచ్చ దాష్టీకం
కనగానపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దౌర్జన్యాలు, దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మండలంలోని తూంచర్ల గ్రామంలో ఎస్సీలపై స్థానిక టీడీపీ నాయకులు దాష్టీకం ప్రదర్శించారు. రహదారి నిర్మాణ పనుల కోసమంటూ దళితుల మరుగుదొడ్లు, బాతురూంలను దౌర్జన్యంగా తొలగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాధితులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు నుంచి తూంచర్ల మీదుగా రహదారి పనులు చేస్తున్నారు. తూంచర్ల వద్ద ఎస్సీ కాలనీ పక్కన రోడ్డు వేస్తున్న సందర్భంలో రహదారి స్థానిక టీడీపీ నాయకుడు రామన్న పొలం వైపు వెళ్లకుండా కాలనీ వైపు తిప్పారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం స్థానిక టీడీపీ నాయకులు దారి నిర్మాణమంటూ వచ్చి దళితులు ఇళ్ల వద్ద నిర్మించుకొన్న మరుగు దొడ్లు, బాత్‌రూంలను దౌర్జన్యంగా తొలగించారు. రాత్రి వేళ జేసీబీలతో వచ్చి కూల్చివేశారని బాధితులు వాపోయారు. ఇళ్ల పక్కన ఉన్న కొబ్బరి చెట్లు, ప్రహరీలను నేలకూల్చారన్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులను వివరణ కోరగా విషయం తమకు తెలియదని, అంతా ఆర్‌అండ్‌బీ అధికారులు చూసుకుంటున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే సునీతకు తెలియజేసినా
న్యాయం జరగలేదు..
ఎస్సీ కాలనీలో దౌర్జన్యంగా మరుగుదొడ్లు తొలగించారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వద్దకు వెళ్లి చెప్పినా న్యాయం జరగలేదని బాధిత మహిళలు వాపోయారు. టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి తొలగించిన మరుగుదొడ్లు, బాతురూంలను తిరిగి నిర్మించి ఇవ్వాలని చెప్పారని, అయితే ఆమె ఫోన్ చేసినాలుగు రోజులవుతున్నా న్యాయం చేయకుండా యథావిధిగా రహదారి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులపై పచ్చ దాష్టీకం
దళితులపై పచ్చ దాష్టీకం


