సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి
ప్రశాంతినిలయం: సమన్వయంతో ముందుకు సాగి జిల్లా అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. జిల్లా అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ దరఖాస్తులు పెండింగ్ ఉంచరాదన్నారు. గడువులోపు అన్ని అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి వాస్తవాలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. జనవరి 24 నుంచి నిర్వహించనున్న ‘స్వర్ణ ఆంధ్రా–స్వచ్ఛ ఆంధ్రా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ‘మన పల్లె–మన నీరు’ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలన్నారు. భూముల సమస్యలపై అందిన దరఖాస్తులు, పరిష్కారం తదితర విషయాలపై ఆరా తీశారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం చేయాలన్నారు. భూముల రీ సర్వేను గడువులోపు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్


