బాలయ్య పీఏల ప్రోద్బలంతోనే చెరువుకు గండి
చిలమత్తూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు వ్యవహరిస్తూ సూగూరు చెరువుకు గండి కొట్టించి నీటిని వృథా చేశారని వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి మండిపడ్డారు. సోమవారం హిందూపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువు నిండితే మరవ పారి దిగువన ఉన్న చెరువులకు నీరు చేరుతుందని అన్నారు. అయితే చెరువు పూర్తి స్థాయిలో నిండకుండానే ఎమ్మెల్యే పీఏలు దౌర్జన్యంగా చెరువుకు గండి కొట్టించారని ఆరోపించారు. చెరువు పూర్తి స్థాయిలో నిండితే ఎగువన ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు ముంపునకు గురవుతాయని ఒకే ఒక్క కారణంతోనే ఈ ఘాతుకానికి తెగించారని మండిపడ్డారు. ఈ అంశంపై హిందూపురం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గండి కొట్టిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని అధికారులను కోరారు. హంద్రీ–నీవా కాలువ వ్యవహారంలోనూ కొటిపి వద్ద గండికొట్టారంటూ అన్యాయంగా రైతులపై కేసులు నమోదు చేయించి, కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిన అధికార యంత్రాంగం ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలన్నారు. చెరువులు, కుంటల నుంచి ఇష్టానుసారంగా మట్టిని వెలికి తీసి కర్ణాటక ప్రాంతాలకు టీడీపీ నేతలు తరలించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రైతుల పేరిట సర్వే నెంబరు పేర్కొని అనుమతులు పొంది మరోచోటుకు మట్టిని తరలిస్తున్నారన్నారు. టిప్పర్లలో రాత్రి వేళల్లో మట్టి తరలిస్తున్న్నారంటే అది సక్రమం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి


