పూజ గదిలోని బంగారం మాయం
బత్తలపల్లి: ఇంట్లో అందరూ ఉండగానే.. పూజ గదిలో ఉంచిన బంగారం కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన జాంపుల అప్పస్వామి తన భార్య రమణమ్మకు వైద్య చికిత్సల నిమిత్తం బత్తలపల్లిలోని ధర్మవరం రోడ్డులో ఉన్న అద్దె ఇంట్లోకి మకాం మార్చాడు. రోజూ స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయ పనులు చూసుకునేవాడు. భార్యకు తోడుగా ఇంట్లో పని మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. మూడు తులాల బంగారు చైను, నాలుగు తులాల బంగారు గాజులు, రెండు తులాల ఆరు ఉంగరాలు, రెండు తాళిబొట్టు చైన్లు, మూడున్నర తులాల ఆరు జతల కమ్మలు మొత్తం 14.5 తులాల బంగారు ఆభరణాలు ఇంట్లో పూజ గదిలోని డ్రాలో పెట్టాడు. ఈ ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దీంతో పని మనిషిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 9న ఆభరణాలు కనిపించకుండా పోయినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
చర్చిలో ఫర్నీచర్ ధ్వంసం
ధర్మవరం రూరల్: మండలంలోని పోతుకుంట వద్ద ఉన్న క్రైస్తవ ప్రార్థన మందిరంలో ఫర్నీచర్‌ను దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం ప్రార్థనలు ముగించుకున్న అనంతరం క్రైస్తవులు చర్చికి తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు చర్చిలోకి చొరబడి ఫర్నీచర్, బండలు, డ్రమ్స్ ఇతర పరికరాలను ధ్వంసం చేశారు. కరపత్రాలను కాల్చి వేశారు. గ్రామానికి దూరంగా చర్చి ఉండడంతో ఈ విషయం ఎవరూ గుర్తించలేదు. మధ్యాహ్నం అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో గ్రామంలోని క్రైస్తవులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విధ్వంసాన్ని పాస్టర్ జాన్‌కు తెలియజేయడంతో ఆయన ఫిర్యాదు మేరకు సీఐ ప్రభాకర్, రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల ఆధారాలు సేకరించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రైస్తవులు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల ‘పచ్చ’పాతం
బత్తలపల్లి: దాడి కేసులో బాధిత వైఎస్సార్‌సీపీ వర్గీయులను అరెస్ట్ చేసి పోలీసులు తమ ‘పచ్చ’పాతాన్ని బయటపెట్టుకున్నారు. చెరువు మట్టి తరలింపు విషయంలో ఈ నెల 14న పోట్లమర్రిలో వైఎస్సార్‌సీపీ వర్గీయులు చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకరరెడ్డి, ప్రభాకరరెడ్డి, జ్ఞానేశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, జనార్దనరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే బాధితుల ఫిర్యాదును తీసుకోకుండా టీడీపీ నేతల ఫిర్యాదుతో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం వారిని అరెస్ట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టకుండా ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించిన తీరును గ్రామస్తులు ఏవగించుకుంటున్నారు.
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
రొద్దం: మండలంలోని కలిపి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు నాగేంద్రప్ప(42) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. మట్టి తరలిస్తుండగా గుంతల రోడ్డు కావడంతో ట్రాక్టర్ నడుపుతున్న నాగేంద్రప్ప పట్టు తప్పి చక్రాల కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే స్థానికులు హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పి...
అమరాపురం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... గుడిబండ మండలం రామయ్యనహట్టి గ్రామానికి చెందిన ఈరన్న (35) అమరాపురం మండలం హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయంలో పురావస్తుశాఖ పరిధిలో నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుణేహళ్లి సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దీంతో ట్రాక్టర్ కిందపడి తీవ్రంగా గాయపడిన ఈరన్నను స్థానికులు వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో ఆయన మృతి చెందాడు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


