తాళం వేసిన ఇంట్లో చోరీ
హిందూపురం: స్థానిక పులమతి రోడ్డులోని రాజరాజేశ్వరీకాలనీలో నివాసముంటున్న తులసీనాయక్ ఇంట్లో చోరీ జరిగింది. బసవనపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తులసీనాయక్ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి ఊరికెళ్లారు. సోమవారం తిరిగి వచ్చి తాళం తీసి లోపలకు వెళ్లారు. అయితే ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండడంతో దొంగలు పడినట్లుగా నిర్ధారించుకుని బీరువాను పరిశీలించారు. అందులో ఉంచిన 8.5 తులాల బంగారు నగలు అపహరించినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కిటికి నుంచి దుండగులు ఇంట్లోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ అబ్దుల్‌కరీం తెలిపారు.


