టీడీపీ నేతల దౌర్జన్యం తాళలేకపోతున్నాం
పుట్టపర్తి టౌన్: టీడీపీ నేతల దౌర్జన్యం తాళలేకపోతున్నామంటూ ఎస్పీ సతీష్‌కుమార్‌కు చిలమత్తూరు మండలం హుస్సేనాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. గ్రామంలోని సర్వే నంబర్ 77–3లో తనకు 11 సెంట్ల స్థలం ఉందని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పక్కా గృహ నిర్మాణం మంజూరు కావడంతో అప్పట్లో స్లాబ్ వరకూ ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించాడు. ఇందుకు సంబంధించి రెండు బిల్లలు కూడా మంజూరయ్యాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహ నిర్మాణాలను ఆపేయడంతో తన ఇంటి నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుందన్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బాబురెడ్డి, గంగిరెడ్డి.. అధికారులను భయపెట్టి ఆ భూమిని గ్రామకంఠంగా చిత్రీరించడంతో పాటు అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ నోటీసులు ఇప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంగా స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు టీడీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని, తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నాడు. స్పందించిన ఎస్పీ వెంటనే హిందూపురం డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య వివరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశించారు.
పరిష్కార వేదికకు 62 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 62 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓ లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఇందిర, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
ఇంటి నిర్మాణాన్ని
అడ్డుకుంటున్నారని ఆవేదన


