‘అనంత’లో 22 నుంచి రంజీ మ్యాచ్‌ | - | Sakshi
Sakshi News home page

‘అనంత’లో 22 నుంచి రంజీ మ్యాచ్‌

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

‘అనంత’లో 22 నుంచి రంజీ మ్యాచ్‌

‘అనంత’లో 22 నుంచి రంజీ మ్యాచ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఆంధ్ర–విదర్భ జట్ల రంజీ మ్యాచ్‌కు అనంతపురం క్రికెట్‌ గ్రౌండు (ఆర్డీటీ) వేదిక కానుంది. ఇక్కడి గ్రౌండులో ఈ మ్యాచ్‌ నిర్వహణకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీజన్‌లో విదర్భతో ఆంధ్రకు ఇది ఐదవ మ్యాచ్‌ అవుతుంది. ఆంధ్ర జట్టులో రికీ భూయ్‌ (కెప్టెన్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీష్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. 2024–25 సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టుకు కెప్టెన్‌గా ఎఫ్‌.అక్షయ్‌ వాడ్కర్‌ వ్యవహరిస్తారు. అలాగే యష్‌.రాథోడ్‌ (వైస్‌–కెప్టెన్‌), ధ్రువ్‌ షోరే, ఆల్‌ రౌండర్‌ నచికేత్‌ భూటే వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. రెండు రోజుల కిందటే ఆంధ్ర జట్టు అనంతపురం చేరుకుంది. కోచ్‌లు న్యూజిలాండ్‌ నుంచి ప్రధాన కోచ్‌ గ్యారీ స్టీడ్‌, అసిస్టెంట్‌తో సోమవారం ప్రాక్టీస్‌ సెషన్‌లు నిర్వహించారు. కోచ్‌ ఎంఎన్‌ విక్రమ్‌ వర్మ, బ్యాటింగ్‌ కోచ్‌ వినీత్‌ ఇందుల్కర్‌, ఎస్‌అండ్‌సీ కౌశిక్‌, ఫిజియో రాహుల్‌, కుశ్వంత్‌, మేనేజర్‌ ఆర్‌.కృష్ణమోహన్‌ ప్రాక్టీస్‌ను పరిశీలించారు. అలాగే విదర్భ జట్టు సభ్యులు సోమవారం సాయంత్రం చేరుకున్నారు. వీరు మంగళవారం క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేయనున్నారు. బీసీసీఐ క్యూరేటర్‌ మోహన్‌ అనంతపురం క్రికెట్‌ గ్రౌండ్‌లో గ్రౌండ్‌ – పిచ్‌ తయారీని పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌ను అనంతపురానికి కేటాయించడం పట్ల ఏసీఏకు అనంతపురం జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్‌, కార్యదర్శి యుగంధర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో రంజీ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఘనంగా సిమ్స్‌ వైట్‌ఫీల్డ్‌ వార్షికోత్సవం

ప్రశాంతినిలయం: స్థానిక సాయికుల్వంత్‌ సభా మందిరంలో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌) 25వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు చేతుల మీదుగా సాయి స్పర్శ్‌ పేరుతో ఆస్పత్రిలో జరిగే వైద్యసేవలు, శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన పుస్తకాన్ని ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సుందరేశన్‌ ఆవిష్కరింపజేశారు. అనంతరం ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సత్యసాయిని స్మరిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం కృతజ్ఙతా కుసుమాంజలి పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement