పన్ను చెల్లిస్తేనే స్థిరాస్తి రిజిస్ట్రేషన్!
ధర్మవరం అర్బన్: ఆస్తి పన్ను చెల్లించిన వారికే రిజిస్ట్రేషన్ చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది. పట్టణాల్లో స్థిరాస్తులకు అసెస్‌మెంట్ నంబర్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకుండా క్రయవిక్రయాలు సాగిస్తుండడంతో ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు నెలలుగా ఈ విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం పక్కా గృహాలపై మాత్రమే ఆస్తి పన్ను ఉండాలనే నిబంధన ఉంది. త్వరలో ఖాళీ స్థలాలపై కూడా పన్నులు కట్టాలనే నిబంధనలు రానున్నట్లు సమాచారం.
అసెస్‌మెంట్ లేకపోతే నిరాకరణ..
జిల్లాలో ధర్మవరం, హిందూపురం, కదిరి మున్సిపాలిటీలతో పాటు పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర నగర పంచాయతీల పరిధిలో పన్నులు చెల్లించిన స్థిరాస్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొండి బకాయిలు వసూలు చేసేందుకు సంబంధిత అధికారులు నోటీసులు ఇస్తే వారిపైనే దౌర్జన్యానికి దిగుతున్నారు. కొంతమంది ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తూ మున్సిపల్ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో పన్ను చెల్లిస్తేనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయడంతో మొండి బకాయిలు వసూలుకు మార్గం సుగమమైంది. ఇకపై ఆస్తులు అమ్మాలన్నా, వారసులకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా పన్ను బకాయిలు ఉండరాదు. పూర్తిగా ఆస్తి పన్ను చెల్లించిన వారికే అసెస్‌మెంట్ నంబర్ ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. అసెస్‌మెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆన్‌లైన్‌లో సిస్టమ్ అంగీకరించడంలేదు.
త్వరలో ఖాళీ స్థలాలపై..
గతంలో ఖాళీ స్థలాలపై పన్నులు వేసేవారు కాదు. త్వరలో ఖాళీ స్థలాలు అమ్మాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రీసర్వేలో భాగంగా ప్రభుత్వం చాలా వరకూ ఖాళీ స్థలాలను గుర్తించి పన్నులు విధించింది. ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఖాళీ స్థలాలను ఎవరికై నా అమ్మాలంటే మొదట పన్ను చెల్లించాలి. వారసత్వంగా ఖాళీ స్థలాలను పిల్లలకు గిఫ్ట్‌డీడ్‌గా ఇవ్వాలన్నా పన్ను చెల్లించక తప్పడం లేదు.
నాన్ లే అవుట్‌లకు బ్రేక్..
ఆస్తి పన్ను చెల్లించి అసెస్‌మెంట్ నంబర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధనలు త్వరలో పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో నాన్ లేఅవుట్ స్థలాల క్రయవిక్రయాలకు బ్రేక్ పడనుంది. గతంలో స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. మున్సిపాలిటీలో ప్లాన్ మంజూరు సమయంలో పన్ను చెల్లించేవారు. తాజా నిబంధనతో నాన్ లేఅవుట్ స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే పన్ను చెల్లించాల్సి వస్తుంది. లేకుంటే 10 శాతం రుసుం చెల్లించి క్రమబద్దీకరించుకోవాల్సి ఉంటుంది.
అసెస్‌మెంట్ నంబర్‌తో
ముడిపెట్టిన ప్రభుత్వం
ఇళ్లు అమ్మాలన్నా, కొనాలన్నా
ఆస్తి పన్ను కట్టాల్సిందే
నూతన నిబంధనలు అమలులోకి
ప్రస్తుతం పట్టణాల్లో అసెస్‌మెంట్ నంబర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఖాళీ స్థలాలకు ఇంకా పన్నులు విధించడం అమలులోకి రాలేదు. ప్రభుత్వం ఎప్పుడైనా నిబంధనలు విధించవచ్చు.
– తాయన్న, సబ్ రిజిస్ట్రార్, ధర్మవరం


