దుక్కి మొదలు.. కోత వరకూ
పుట్టపర్తి అర్బన్: వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి చేయడానికి రైతులు పెద్ద ఎత్తున యంత్రాలపై ఆధారపడుతున్నారు. కొంతమంది పెద్ద రైతులు వివిధ రకాల యంత్రాలను రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి తమ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇతర రైతులకూ అద్దెకు ఇస్తున్నారు. కూలీలు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను ఎంచుకోవడంతో వ్యవసాయంలో యంత్రాల వినియోగం తప్పనిసరిగా మారింది.
ఆధునిక యంత్రాల వినియోగం
జిల్లాలో వివిధ రకాల పంటలతో పాటు అత్యధికంగా రైతులు రాగి చేస్తున్నారు. ఈ క్రమంలో పంటల సాగులో ఆధునిక యంత్రాల వినియోగం పెరిగింది. దుక్కి దున్నడం మొదలు.. పంట కోతల వరకూ వివిధ రకాల యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయం సులువైనట్లు రైతులు పేర్కొంటున్నారు. చివరకు పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను వినియోగిస్తుండడంతో సమయంతో పాటు డబ్బు కూడా ఆదా ఆవుతోందని అంటున్నారు.
రైతుకు అండగా జగన్ ప్రభుత్వం
ఆరుగాలం శ్రమించే రైతులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. వైఎస్సార్ యంత్ర సేవ పథకంలో భాగంగా వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను 40 శాతం సబ్సిడీతో అందించారు. ఆర్‌బీకే పరిధిలోని ఐదురుగు రైతుల గ్రూపునకు రూ.14 లక్షల విలువైన యూనిట్‌ను అందించి ఆదుకున్నారు. ఈ యంత్రాల సబ్సిడీని రైతులు సదరు యంత్రాన్ని ఇంటికి తీసుకెళ్లేలోపే వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తూ వచ్చారు. ఈ లెక్కన వైఎస్ జగన్ హయాంలో జిల్లాకు 325 ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, రోటోవేటర్, 5 మడకల గొర్రు, తదితర పరికరాలను రైతులు అందిపుచుకున్నారు. ఇందుకు గాను సుమారు రూ. 45.50 కోట్ల లబ్ధి చేకూరింది.
వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణ పెనుమార్పులను తీసుకొచ్చింది. ఫలితంగా దుక్కులు మొదలు కోతల వరకు అనేక రకాల పనులు సులభతరమయ్యాయి. పురుగు మందులను సైతం యంత్రాల సాయంతోనే పిచికారీ చేస్తున్నారు. ఇది వ్యవసాయాన్ని మరింత సులువు చేసింది.
యంత్రాల సాయంతో పంటల సాగు
నానాటికీ తగ్గుతున్న కూలీల సంఖ్య
‘స్వామ్’ అమలులో చతికిల
వ్యవసాయ రంగంలో పెరుగుతున్న కూలీల కొరతను అధిగమించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. కోట్ల వ్యయంతో వ్యవసాయ యాంత్రీకరణ (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్–స్మామ్) పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకంలో భాగంగా ఒక యూనిట్ యంత్రం కొనుగోలు వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను భరిస్తాయి. సాధారణ, చిన్న, సన్నకారు మహిళా రైతులకు 60 శాతం రాయితీ ఇస్తారు. అంటే మహిళా రైతులకు రూ. లక్ష విలువైన యంత్ర పరికరం రూ.40 వేలకే రానుంది. రూ.60 వేలు మాఫీ అవుతుంది. అలాగే పెద్ద రైతులకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం రాయితీ ఉంటుంది. మిగిలిన రైతులకు 50 శాతం రాయితీతో ఇస్తారు. ఈ పథకం కింద రోటోవేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, పెట్రోల్ పంపులు, కల్టివేటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లు, విత్తనాలు విత్తే యంత్రాలు, ఇతర ట్రాక్టర్ ఆధారిత వ్యవసాయ పరికరాలు అందిస్తారు. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ కనీసం ఏ ఒక్క రైతునూ ఎంపిక చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.
దుక్కి మొదలు.. కోత వరకూ


