అందని పీఏబీఆర్‌ నీరు | - | Sakshi
Sakshi News home page

అందని పీఏబీఆర్‌ నీరు

Jan 19 2026 9:18 AM | Updated on Jan 19 2026 9:18 AM

అందని

అందని పీఏబీఆర్‌ నీరు

ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నాం

ఇప్పటి వరకూ ఏడాది కూడా మండలంలోని చెరువులు, కుంటలకు నీరు సక్రమంగా అందింది లేదు. గత రెండేళ్లుగా వర్షాలు కురవక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో చీనీ చెట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. పీఏబీఆర్‌ నీటిని సకాలంలో విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.

– వై.తిమ్మారెడ్డి, రైతు, శివంపల్లి

ప్రత్యేక చర్యలు చేపట్టాలి

తాడిమర్రి మండలంలోని చెరువులకు పీఏబీఆర్‌ నీరు సజావుగా చేరేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పీఏబీఆర్‌ కాలువ ఎగువ ప్రాంత రైతులు గండ్లు కొట్టకుండా గస్తీ చేపట్టాలి. నీటి చౌర్యాన్ని అరికట్టాలి.

– వడ్డి రామలింగారెడ్డి,

ఏపీ రైతు సంఘం నాయకుడు, కునుకుంట్ల.

రెండు రోజుల్లో చేరతాయి

గత ఏడాది డిసెంబర్‌ 30న పీఏబీఆర్‌ నుంచి నీటిని విడుదల చేశాం. కాలువకు గండ్లు కొట్టడం, ధ్వంసం చేయకుండా ప్రత్యేక చర్యలూ తీసుకున్నాం. మరో రెండు రోజుల్లో ఎం.అగ్రహారం చెరువుకు నీరు చేరుతాయి. తాడిమర్రి మండలంలో నీటి కేటాయింపులు ఉన్న చెరువులను తప్పని సరిగా 50 శాతం నింపుతాం.

– రాధాకృష్ణ, డీఈ, పీఏబీఆర్‌

తాడిమర్రి: వర్షాభావ పరిస్థితులతో తాడిమర్రి మండల రైతులు పీఏబీఆర్‌ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 30న పీఏబీఆర్‌ వద్ద ధర్మవరం కుడి కాలువకు నీటిని ఆ శాఖ అధికారులు విడుదల చేశారు. అయితే నేటికీ 20 రోజులు గడిచినా తాడిమర్రి మండలంలోని ఏ ఒక్క చెరువుకూ చుక్క నీరు చేరలేదు.

ప్రాధాన్యత తాడిమర్రి మండలానికే

పీఏబీఆర్‌ నీటి సరఫరా నిబంధనల మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిట్టచివరన ఉన్న తాడిమర్రి మండలంలోని చెరువులను ముందుగా నింపాల్సి ఉంది. ఈ నిబంధన మేరకే గత ఏడాది డిసెంబర్‌ 30న పీఏబీఆర్‌ వద్ద కుడి కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే ప్రజాప్రతినిధుల అలసత్వం, ఉన్నతాధికారులు ఉదాసీనత కారణంగా జలాశయానికి సమీపంలోనే ధర్మవరం కుడి కాలువకు గండి పడడంతో నీరంతా వృథా అవుతుండడంతో గేట్లు దించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పూర్తి స్థాయిలో గేట్లు కిందకు దిగకపోవడంతో వృథా నీటిని ఎంపీఆర్‌కు అధికారులు మళ్లించారు. ఆ తర్వాత పనులు వెనువెంటనే పూర్తి చేయడంలో అధికారులు అలసత్వం వహించారు.

రైతుల పాలిట శాపం

తాడిమర్రి మండలంలోని చెరువులకు పీఏబీఆర్‌ నుంచి ఇప్పటి వరకూ ఏ ఏడాది కూడా పూర్తి స్థాయి నీరు చేరింది లేదు. గత రెండేళ్లుగా మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో బోరుబావుల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గింది.కొన్ని ప్రాంతాల్లో బోర్లు వట్టి పోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఏకపాదంపల్లి, పుల్లంపల్లి, పిన్నదరి, పుల్లానారాయణపల్లి, భీమరాయునిపేట, నిడిగల్లు, నార్శింపల్లి, శివంపల్లి, పుల్లంపల్లి, తాడిమర్రి, మరవపల్లి, ఎం.అగ్రహారం, మోదుగులకుంట, బంగారంపేట తదితర గ్రామాల్లో రైతులు చీనీ, మామిడి, సపోటా, అరటి, దానిమ్మ, అరటి తదితర పండ్ల తోటలు వాడు పడుతున్నాయి. తాడిమర్రి తూర్పు, పడమటి చెరువులు, ఎం.అగ్రహారం, నార్శింపల్లి, నిడిగల్లు, పుల్లంపల్లి గ్రామాల్లో చెరువులు, మేడిమాకులపల్లి, పుల్లానారాయణపల్లి, ఏకపాదంపల్లి తదితర గ్రామాల్లో కుంటలు ఉన్నాయి. పీఏబీఆర్‌ నీరు సక్రమంగా సరఫరా అయి ఉంటే ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి ప్రత్యక్షంగా నార్శింపల్లి, నిడిగల్లు, పుల్లంపల్లి, పుల్లానారాయణపల్లి, పూలఓబయ్యపల్లి, ఏకపాదంపల్లి, భీమరాయునిపేట, మేడిమాకులపల్లి, శివంపల్లి, మరవపల్లి, ఎం.అగ్రహారం, తాడిమర్రి తదితర పదమూడు గ్రామాల రైతులకు లబ్ధి చేకూరేది. పరోక్షంగా మోదుగులకుంట, బంగారంపేట, చిల్లకొండయ్యపల్లి, ఆత్మకూరు, పట్రపల్లి తదితర మరో పది గ్రామాల రైతులూ బాగుపడేవారు. ఆయా గ్రామాల్లో సుమారు 1,500 ఎకరాల్లో భూముల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. మరో వెయ్యి ఎకరాల్లో చీనీ, దానిమ్మ, మామిడి తదితర పండ్ల తోటలకు సాగు నీరు అందుతుంది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.

జలాశయం నుంచి విడుదల చేసి 20 రోజులు దాటినా నేటికీ చేరని నీరు

అడుగంటిన భూగర్భ జలాలు

వాడుతున్న పంటలు, తోటలు

అందని పీఏబీఆర్‌ నీరు 1
1/2

అందని పీఏబీఆర్‌ నీరు

అందని పీఏబీఆర్‌ నీరు 2
2/2

అందని పీఏబీఆర్‌ నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement