జల విద్యుత్ ఉత్పత్తిపై నీలి నీడలు
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిపై నీలి నీడలు వీడలేదు. టర్బైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గత ఏడాది నవంబర్ 22 నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేశారు. మరమ్మతులకు స్థానిక సాంకేతిక నిపుణులు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో తుంగభద్ర డ్యాం గేటును డిజైన్ చేసిన నిపుణుల బృందం వచ్చి మరమ్మతులు పూర్తి చేసింది. ఆ సమయంలో అధికారులు ట్రయల్ రన్ చేసి టర్బైన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా జల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు చేపట్టలేదు. వేసవిలో తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత తలెత్తకుండా జలవిద్యుత్ ఉత్పత్తికి నీటి పారుదల శాఖ అధికారులు అంగీకరించడం లేదని జెన్‌కో ఏడీ కేశవయ్య ఆదివారం తెలిపారు.
నీటి గుంతలో పడ్డ
ఐదేళ్ల చిన్నారి
ఉరవకొండ: ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడ్డాడు. సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాలు... ఉరవకొండలోని భద్రప్ప బావి వద్ద తాగునీటి పైప్‌లైన్‌లో డ్త్రెనేజీ నీరు కలుస్తుండడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతు చేపట్టారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం పెద్ద గుంతను తీసి నాలుగు రోజుల క్రితం మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం గుంతను పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఆదివారం ఉదయం ఐదేళ్ల చిన్నారి ప్రణీత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తన ఇంటి ఎదురుగా ఉన్న సదరు గుంతల్లో పడిపోయాడు. నీటిలో మునిగిపోతుండగా గమనించిన ఏడేళ్ల వయసున్న అన్న లింగేష్ వెంటనే ప్రణీత్ జట్టు పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని చిన్నారిని వెలికి తీశారు. మరికొద్ది నిమిషాలు ఆలస్యమై ఉంటే చిన్నారి ప్రాణాలు ప్రమాదంలో పడేవని కాలనీ వాసులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అక్కడకు చేరుకోవడంతో కాలసీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏటీఎం దొంగ అరెస్ట్
తాడిపత్రి రూరల్: స్థానిక కడప మార్గంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోని కియోస్క్‌ను పెద్ద బండరాయితో పగులకొట్టే ప్రయత్నం చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన దుర్గానాయుడు, తన తండ్రితో కలసి పని కోసం తాడిపత్రికి వచ్చాడు. వ్యసనాలకు బానిసైన దుర్గానాయుడు జల్సాలు తీర్చుకునేందుకు ఈజీ మనీ కోసమని ఆదివారం తెల్లవారుజామున ఏటీఎంలోని యంత్రాన్ని ధ్వంసం చేసి డబ్బు అపహరించేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గుర్తించిన ముంబయిలోని సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకోగానే దుర్గానాయుడిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. విచారణ అనంతరం దుర్గానాయుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పుట్టపర్తి అర్బన్ సీఐపై
సస్పెన్షన్ వేటు?
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయలును ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. పుట్టపర్తి సీఐగా విధుల్లో చేరినప్పటి నుంచి శివాంజనేయలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల నమోదులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. స్టేషన్‌లో పనిచేసే సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆయా విషయాలపై బాధితులు ఆధారాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పరిశీలించిన ఉన్నతాధికారులు సీఐ శివాంజనేయులుపై సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
జల విద్యుత్ ఉత్పత్తిపై నీలి నీడలు
జల విద్యుత్ ఉత్పత్తిపై నీలి నీడలు
జల విద్యుత్ ఉత్పత్తిపై నీలి నీడలు


