కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె
బుక్కరాయసముద్రం: అనంతపురం శివారున బుక్కరాయసముద్రం సమీపంలో వెలసిన కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 25న దేవర కొండపై వెయ్యిలీటర్ల నెయ్యితో అఖండ జ్యోతి వెలిగించనున్నారు. మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను సాయంత్రం ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్తారు. 26న ఉదయం ఎనిమిది గంటలకు కొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యాహవచనం, అంకురార్పణ, దేవతా హోమం నిర్వహిస్తారు. అదే రోజున రాత్రి ఎనిమిది గంటలకు స్వామికి పుష్ప పల్లకీసేవ, 27న సింహ వాహనం, 28న శేషవాహనం, 29న హనుమద్‌వాహనం, 30న గరుడ వాహనం, 31న శ్వేత గజ వాహనంపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు.
ఫిబ్రవరి 1న రఽథోత్సవం..
మండల కేంద్రంలో ఫిబ్రవరి ఒకటోతేదీ వేకువజామున నాలుగు గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది. అనంతరం గరుడాద్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వామిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి స్థానిక లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి మండలకేంద్రంలోని వీధుల్లో ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొస్తారు. అనంతరం ప్రత్యేక పూజల అనంతరం కొండమీదరాయుడిని రథంపై ఉంచి రథోత్సవం నిర్వహిస్తారు. 2న అశ్వవాహనంపై ఊరేగిస్తారు. 3న తీర్థవాది వసంతోత్సవం జరిపి, రాత్రి 8 గంటలకు హంస వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. ఈ తిరునాలకు భక్తులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, తదితర ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
25 నుంచి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 1న తిరునాల, రథోత్సవం
కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె
కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె


