తిమ్మమ్మమర్రిమానును సందర్శించిన ట్రైనీ ఐపీఎస్
ఎన్‌పీకుంట: మండల పరిధిలోని గూటిబైలు గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మమర్రిమానును ఆదివారం ట్రైనీ ఐపీఎస్ కె.అశ్విన్‌మణిదీప్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా తిమ్మమాంబ ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. తిమ్మమాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మర్రిమాను ప్రాంతంలో కలయతిరిగారు. మర్రిమాను విశిష్టత, ఆలయ చరిత్రను టూరిజం గైడ్ మనోహర్, అనిల్‌రాయల్ ద్వారా తెలుసు కున్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వేమన జీవితం ఆదర్శం
● కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి
గోరంట్ల (సోమందేపల్లి): ప్రజాకవి యోగి వేమన జీవితం ఆదర్శప్రాయమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. గోరంట్ల పట్టణంలో వేమన విగ్రహావిష్కరణను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన కలశ పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మూఢ నమ్మకాలను రూపుమాపేందుకు వేమన కృషి చేశారన్నారు. సాహిత్యాన్నే ఆయుధంగా మార్చుకుని పోరాడారని కొనియాడారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర రెడ్డి సంఘం ఉపాధ్యక్షుడు వెంకట శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడి,్డ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
రీ సర్వే పక్కాగా చేపట్టాలి
● జేసీ మౌర్య భరద్వాజ్
పరిగి: భూముల రీసర్వే పక్కాగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. ఆదివారం ఆయన పరిగి తహసీల్దారు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎర్రగుంట రెవెన్యూ గ్రామ పరిధిలో జరుగు తున్న రీ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందుల్లేకుండా సర్వే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు హసీనాసుల్తానా, డీటీ హనుమంతు పాల్గొన్నారు.
హిందూపురం: పట్టాదారు పాసు పుస్తకాల్లో పొరపాట్లకు తావివ్వరాదని జేసీ ఎం.మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. ఆదివారం హిందూ పురం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చలివెందుల గ్రామంలో రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాల ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల్లో పట్టాదారు సమాచారాన్ని జాగ్రత్తగా ధ్రువీకరించాలని సూచించారు.
ఎస్‌ఐపై టీడీపీ కార్యకర్త కుమార్తె దాడి
అగళి: మండల ఎస్‌ఐ శోభారాణిపై ఓ టీడీపీ కార్యకర్త కుమార్తె దాడి చేశారు. ఈ ఘటన మండలంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఇరిగేపల్లి సమీపంలో మండే మారమ్మ ఆలయం వద్ద టీడీపీ కార్యకర్త మల్లికార్జున్ ధాబా నిర్వహిస్తున్నాడు. ఇటీవల ధాబాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో సిబ్బందితో కలిసి ఎస్‌ఐ శోభారాణి ధాబాలో దాడులు నిర్వహించి కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ధాబా నిర్వాహకుడు మల్లికార్జునను స్టేషన్‌కు తరలిస్తుండగా, ఆయన కుమార్తె కీర్తన పోలీసులను అడ్డుకుంది. ఉన్నఫళంగా ఎస్‌ఐ శోభారాణిపై దాడి చేసింది. దీనిపై ఎస్‌ఐ శోభారాణి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గుడిబండ ఎస్‌ఐ రాజ్‌కుళ్లాయప్ప కేసు విచారణ చేపట్టారు.
తిమ్మమ్మమర్రిమానును సందర్శించిన ట్రైనీ ఐపీఎస్
తిమ్మమ్మమర్రిమానును సందర్శించిన ట్రైనీ ఐపీఎస్


