అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు...
● ధనార్జనే ధ్యేయంగా ఇసుక దందా
● ‘పచ్చ’నేత కనుసన్నల్లోనే దోపిడీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని కర్ణాటక సరిహద్దున ఉన్న బొమ్మనహాళ్ మండలంలో టీడీపీ ముఖ్య నాయకుడు కనుసన్నల్లో ఇసుక అక్రమ దందా ఊపందుకుంది. ధనార్జనే ధ్యేయంగా రేయింబవళ్లూ ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు నుంచే ఇసుక అక్రమ తరలింపులు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కణేకల్లు మండలం రచ్చుమర్రి, గుండ్లపల్లి క్రాస్ వద్ద వేదావతి హగరి నదిలోని ఇసుకను టిప్పర్లలో లోడు చేసి బొమ్మనహాళ్ మీదుగా సరిహద్దు దాటించి బళ్లారి సమీపంలో పెద్ద ఎత్తున డంప్ చేశారు. రోజూ 30 నుంచి 40 టిప్పర్లకు పైగా ఇసుక తరలిస్తున్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో టిప్పర్ రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నట్లుగా సమాచారం. ‘అధికారం మాది.. అడిగేదెవరూ.. అడ్డగించేదెవరూ’ అనే రీతిలో టీడీపీ నేత రెచ్చిపోతుండడంతో అధికారులు మిన్నకుండి పోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఇసుక అక్రమ తరలింపులపై బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్ మాట్లాడుతూ.. అవసరాలకు కాకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ సరిహద్దులు దాటి ఇసుక టిప్పర్లు వెళ్లలేదని పేర్కొన్నారు.


