సర్వే చేయలేదంటూ షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

సర్వే చేయలేదంటూ షోకాజ్‌ నోటీసులు

Dec 9 2025 7:02 AM | Updated on Dec 9 2025 7:02 AM

సర్వే

సర్వే చేయలేదంటూ షోకాజ్‌ నోటీసులు

మీమాంసలో ఎనర్జీ అసిస్టెంట్లు

అనంతపురం టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాలపై సర్వే చేయలేదంటూ ఎనర్జీ అసిస్టెంట్లకు జిల్లా సచివాలయ అధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఒకరిద్దరు కాదు... ఏకంగా 137 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం కలవరానికి తెరలేపింది.

పేరుకు మాత్రమే సచివాలయం విధులు

ఎనర్జీ అసిస్టెంట్లు పేరుకు మాత్రమే సచివాయల ఉద్యోగులే అయినా పని మొత్తం విద్యుత్‌ శాఖలోనే చేయాల్సి ఉంటుంది. ఉదయం సచివాలయంలో ముఖ హాజరు వేసుకున్న అనంతరం సాయంత్రం వరకూ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తుంటారు. దీనికి అదనంగా ప్రతి రెండు రోజులకు ఒకసారి నైట్‌ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దీంతో వారు సర్వే చేయాల్సిన పని లేదంటూ విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల చెప్పడంతో ఆ మేరకు ఎనర్జీ అసిస్టెంట్లు సర్వేకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో సచివాలయాల పరిధిలోని కుటుంబాలకు కౌశలం, సిటిజన్‌ ఈకేవైసీ, మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌పై డోర్‌ టూ డోర్‌ సర్వే చేయలేదని జిల్లా వ్యాప్తంగా 137 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు జిల్లా సచివాలయ అధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఈ నెల 3న షోకాజ్‌ నోటీసులు అందుకున్న ఎనర్జీ అసిసెంట్లు ప్రస్తుతం తాము సంజాయిషీ ఎవరికి ఇవ్వాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా సచివాలయ అధికారికి సంజాయిషీ ఇవ్వాలా? లేదంటే విద్యుత్‌ శాఖ ఎస్‌ఈకి సంజాయిషీ ఇవ్వాలో స్పష్టత లేకుండా పోతోంది. సర్దుబాటు చర్యల్లో భాగంగా మండలాల్లో పనిచేస్తున్న చాలా మంది ఎనర్జీ అసిస్టెంట్లను అనంతపురం నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు విద్యుత్‌ శాఖ అధికారులు బదిలీ చేశారు. వీరికి సర్వే చేయాలనే అంశంపై ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అయినా షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.

ఉద్యోగాలకు ఎలాంటి ముప్పులేదు

వాస్తవానికి వారు ఎనర్జీ అసిస్టెంట్లు కాదు (జేఎల్‌ఎం గ్రేడ్‌–4) ఉద్యోగులు. విద్యుత్‌ శాఖ విధులంటే 24 గంటలూ పని చేయాల్సి ఉంటుంది. దీంతో వారు సర్వేలు చేయరని ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఎనర్జీ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసు ఇచ్చే అధికారం జిల్లా సచివాలయ అధికారికి లేదు. జీతం మేమే చెల్లిస్తున్నాం, పనులు మేమే చేయించుకుంటున్నాం కాబట్టి ఆ అధికారం మాకే ఉంది. ప్రస్తుతం అందుకున్న నోటీసులకు సంజాయిషీ మాత్రమే ఇవ్వండి. వారి ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదు.

– శేషాద్రి శేఖర్‌, ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ

జిల్లాలో 137 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు

ఎవరికి సంజాయిషీ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి

గగ్గోలు పెడుతున్న ఎనర్జీ అసిసెంట్లు

సర్వే చేయలేదంటూ షోకాజ్‌ నోటీసులు 1
1/1

సర్వే చేయలేదంటూ షోకాజ్‌ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement