కౌన్సిలర్ చేతిలో ఓడిపోయిన స్థాయి నీది
కదిరి: ‘స్థానిక మున్సిపల్ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న అత్తార్ చాంద్‌బాషా చేతిలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నువ్వు ఏ అర్హత ఉందని మా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతావ్?’ అంటూ కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కౌన్సిలర్ రాంప్రసాద్‌తో కలసి సోమవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నకిలీ డీడీల కేసులో శిక్ష పడిన ఖైదీ నువ్వు. నేరాలకు కేరాఫ్ అడ్రెస్ నీది. అలాంటి నువ్వు నీతులు మాట్లాడితే జనమే కాదు.. మీ పార్టీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు. 2004లో పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ తరఫున ఎంఎస్ పార్థసారథికి టికెట్ ఇస్తే ఆయనను మోసగించావ్. అప్పట్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి నువ్వు కూడా ఓడిపోతివి. తర్వాత 2009లో ప్రజారాజ్యం తరఫున సిద్దారెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లను చీల్చడంతో నువ్వు ఓటమి నుంచి బయట పడ్డావు. లేదంటే అప్పుడు కూడా నీకు గెలుపు లేదు. ఆ తర్వాత 2014లో ‘ఆఫ్ట్రాల్ కౌన్సిలర్’ అని నువ్వు పదే పదే ఎద్దేవా చేసిన చాంద్‌బాషా చేతిలో ఓడిపోతివి. మళ్లీ వరుసగా 2019లోనూ మా పార్టీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయావు. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా మూడు పార్టీలు కలిస్తే నీకు వచ్చింది కేవలం 6 వేల మెజార్టీ. ఇది నీ రాజకీయ చరిత్ర. మదమెక్కి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. జాగ్రత్త. మరోసారి వైఎస్ జగన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ స్థాయికి తగ్గ సమాధానమే ఇస్తాం’ అని ధ్వజమెత్తారు. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కదిరి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ది జరిగింది. కానీ మీ హయాంలో జరిగిన అభివృద్ది ఏంటో చెప్పండి. దీనిపై బహిరంగ చర్చకు సిద్దం’ అని సవాల్ విసిరారు. హిందూపూర్ క్రాస్ నుంచి కోనేరు సర్కిల్ వరకూ నిత్యం ట్రాఫిక్ జామ్ కావడానికి ఎమ్మెల్యే కందికుంటనే కారణమన్నారు. కదిరి నుంచి ఎన్‌పీ కుంట వరకూ రోడ్డు 3 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి 18 నెలలు కావస్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.
కందికుంటపై పూల శ్రీనివాసరెడ్డి ఫైర్


