విందు భోజనం తిని 20 మందికి అస్వస్థత
ఓడీచెరువు: మండల పరిధిలోని బత్తినపల్లిలో బుధవారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని విందుభోజనం ఆరగించిన వారిలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న వెంటనే వారంతా వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో బంధువులు ఓడీచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ఏడుగురిని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణాపాయం లేదని, బత్తినపల్లిలోనూ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అయితే కలుషితమైంది ఆహారమా... తాగునీరా అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు.
‘క్రమబద్ధీకరణ’ గడువు పొడిగింపు
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పుడా) పరిధిలోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు, అనఽధికార నిర్మాణాలు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగించిందని ‘పుడా’ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు గతంలో అక్టోబర్ 23వ తేదీ వరకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. అయితే వివిధ కారణాలతో చాలా మంది తమ నిర్మాణాలు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకోలేకపోయారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం క్రమబద్ధీకరణ గడువును 2026 మార్చి వరకు పొడిగించిందన్నారు. 2005 ఆగస్టు 1వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులకు మాత్రమే ‘క్రమబద్ధీకరణ’ అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ‘పుడా’ వైస్ చైర్మన్ సూచించారు. మరిన్ని వివరాలకు పుట్టపర్తిలోని పుడా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించండి
అనంతపురం సిటీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో ప్రారంభం కానున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు డిసెంబర్ ఒకటి నుంచి 15వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఏపీ ఆన్‌లైన్ సేవా కేంద్రం లేదా ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా నేరుగా చెల్లించవచ్చని వివరించారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు, రూ.25 అపరాధ రుసుముతో 11 నుంచి 12వ తేదీ వరకు, రూ.50తో 13 నుంచి 15 వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్ష ఫీజు వివరాలకు వెబ్‌సైట్ www.apopenrchoo.ap.gov.in చూడాలని సూచించారు.
సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించాలి
బెళుగుప్ప: గ్రామాల్లో సుస్థిర వ్వయసాయంపై రైతన్నలు దృష్టి సారించాలని సుస్థిర వ్యవసాయం జిల్లా డీపీఎం లక్ష్మానాయక్ పేర్కొన్నారు. బుధవారం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతు ఆజిద్ బాషా సాగు చేస్తున్న ఏగ్రేడ్ మోడల్ సుస్థిర వ్వయసాయం విధానాలను జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. పంటలకు గ్రీన్ కవర్, జీవ వైవిద్య పంటలు, బీజా మృతంతో విత్తన శుద్ధి, ఘన జీవామృతం, మోడల్ సోయింగ్ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నరేంద్ర, సిబ్బంది శివశంకర్, మారెన్న, నాగరాజు, ఎల్‌త్రీ క్యాడర్ త్రివేణి, శేఖర్, తిప్పక్క తదితరులు పాల్గొన్నారు.
విందు భోజనం తిని 20 మందికి అస్వస్థత
విందు భోజనం తిని 20 మందికి అస్వస్థత


