విద్యార్థి మృతి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు
కనగానపల్లి: మండల కేంద్రం సమీపంలో ఓ రైతు పొలంలో విద్యుత్ ప్రమాదానికి గురై విద్యార్థి మృతి చెందిన అంశానికి సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహమ్మద్ రిజ్వాన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై పదో తరగతి విద్యార్థి బిల్లే వరుణ్ (16) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యుత్ శాఖ మండల ఏఈ కొండారెడ్డి, లైన్‌మెన్ బ్రహ్మయ్య, హెల్పర్ నాగరాజుతో పాటు సంబంధిత పొలం రైతు దస్తగిరిబాబు, కుమారుడు వంశీపై బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని యువకుడి మృతి
కదిరి టౌన్: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని గూడ్స్ షెడ్డు పక్కనే ఉన్న చింతచెట్టు కింద ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ వి.నారాయణరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు తెలుపు రంగు టీషర్టు, నలుపురంగు కాటన్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96851కు సమాచారం అందించాలని కోరారు. కాగా, యువకుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
బాలుడి అదృశ్యం
తలుపుల: మండలంలోని గరికిపల్లికి చెందిన గంగాద్రి, కళావతి దంపతుల నాలుగేళ్ల కుమారుడు హర్షవర్ధన్.. బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల విచారించినా బాలుడి ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థి మృతి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు


