లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
కదిరి టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌లు రద్దు చేయాలంటూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో కదిరిలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీవీ రాఘవులు తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రానికి పూర్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పాత చట్టాలలో ఉన్న కొద్ది పాటి కార్మికుల హక్కులను కూడా కాలరాస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం అడిగే హక్కు, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడం రాజ్యాంగం స్ఫూర్తిని దెబ్బతీయడమేనన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ మాట్లాడుతూ.. గతంలో 42 రోజుల పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే చంద్రబాబు, లోకేష్ శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారని, ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా అంగన్‌వాడీలకు జీతాలు పెంచకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎల్ నరసింహులు, నాయకులు లక్ష్మీనారాయణ, సాంబశివ, బాబ్జాన్, జగన్‌మోహన్, రామ్మోహన్, ముస్తాక్, సుధాకర్‌రెడ్డి, సుజాత, ప్రమీలమ్మ, లక్ష్మీదేవి, రాధమ్మ, మోక్షప్రియ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు


