బంగారు నగల అపహరణ
● బాధితురాలు ఏపీ సచివాలయ ఉద్యోగి
బత్తలపల్లి: గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్‌లో అగ్రికల్చర్, కార్పొరేషన్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రేమింద్రావతి బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె బ్యాగ్‌లోని బంగారు నగలు ఉన్న బాక్స్‌ను దుండగులు అపహరించారు. ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. వివరాలు... తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో నివాసముంటున్న తన మేనమామ ఇంట శుభకార్యంలో పాల్గొనేందుకు సిద్ధమైన ప్రేమింద్రావతి ఈ నెల 23న తన అత్తింటికి వెళ్లి రెండు బంగారు గాజులు, ఓ జత కమ్మలు తీసుకుంది. వీటిని ఓ బాక్స్‌లో ఉంచి దానిని ల్యాప్‌టాప్‌తో పాటు బ్యాగ్‌లో పెట్టుకుని ఈ నెల 24న కర్నూలు నుంచి బయలుదేరి అనంతపురం మీదుగా అదే రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు బత్తలపల్లిలోని నాలుగురోడ్ల కూడలిలో దిగింది. అనంతరం దాడితోటకు వెళ్లేందుకు రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన ఆమె కొంత దూరం వెళ్లిన తర్వాత తన బ్యాగ్‌ను పరిశీలించుకుంది. జిప్‌లు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి బ్యాగ్‌ను పరిశీలించింది. అందులో బంగారు నగలు ఉంచిన బాక్స్ కనిపించలేదు. బస్సు దాడితోటకు చేరిన తర్వాత తన మేనమామకు జరిగిన విషయాన్ని వివరించింది. బుధవారం ఉదయం భర్త తులసీనాథ్‌రెడ్డితో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
భార్యపై కత్తితో దాడి
కదిరి అర్బన్: మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో భార్యపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచాడు. వివరాలు.. గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామానికి చెందిన శైలజ, మణికంఠ రెడ్డి దంపతులు. మణికంఠరెడ్డి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. బుధవారం రాత్రి కుమ్మరవాండ్లపల్లిలో శైలజ ఉండగా భర్త అక్కడకు చేరుకుని కత్తితో ఆమె గొంతులో పొడిచి, పారిపోయాడు. గాయపడిన శైలజను చికిత్స నిమిత్తం కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
గోల్ షాట్‌బాల్
జిల్లా జట్ల ఎంపిక
కదిరి అర్బన్: మండలంలోని ఎరుకులవాండ్లపల్లిలో ఉన్న హరీష్ పాఠశాలలో బుధవారం గోల్ షాట్‌బాల్ జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 80 మంది క్రీడాకారులు పాల్గొనగా, వీరిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న బాలికల జట్టులో శైలజ, హృతిక, హిమబిందు, ఆర్తిక, హర్షిత, సుష్మిత, వర్షిణి, జోత్స్న, బాలుర జట్టులో కార్తీక్‌నాయుడు, చరణ్‌నాయక్, పవన్‌నాయక్, రాజు, తరుణ్, రేవంత్, జగదీష్, యశ్వంత్, ప్రేమ్‌కుమార్‌నాయక్, అఫ్రోజ్, గణేష్, జశ్వంత్ ఉన్నారు. ఎంపికలను గోల్ షాట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు మనోహర్‌రెడ్డి, ప్రసన్నకుమార్ హరీష్ స్కూల్ ప్రిన్సిపాల్ కిరణ్, సుగుణమ్మ, రామాంజనేయులురెడ్డి పర్యవేక్షించారు.
చోరీ కేసులో
ముద్దాయికి జైలు శిక్ష
గుడిబండ: బంగారు గొలుసు అపహరణ కేసులో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దారా రమేష్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మడకశిర జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి అశోక్‌కుమార్ బుధవారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప వెల్లడించారు. గుడిబండ మండలం మద్దనకుంటలో నివాసముంటున్న వీరహనుమక్క ఇంట్లోకి 2018లో చొరబడిన దారా రమేష్ బంగారు గొలుసు అపహరించుకెళ్లాడు. అప్పటి ఎస్‌ఐ శరత్‌చంద్ర కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఈ కేసులో వాదనలు కొనసాగుతూ వచ్చాయి. బుధవారం వాదోపవాదాలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను పీపీ విఠల్‌రావు వినిపించారు.


