ఆధ్యాత్మిక కల్పవల్లి.. భక్తరపల్లి
మడకశిర రూరల్: దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడగుంట ఆంజనేయస్వామి దేవాలయాలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ భక్తుల కొంగు బంగారంగా మారాయి. మడకశిరకు 9 కిలోమీటర్ల దూరంలో భక్తరపల్లి, జిల్లెడగుంట ఆలయాలు ఉన్నాయి.
శతాబ్దాల చరిత్ర
భక్తరపల్లి, జిల్లేడుగుంట ఆలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. చరిత్రకారులు చెబుతున్న దానిని బట్టి పరిశీలిస్తే.. శాలివాహన శకం 1,200లో వ్యాసరాయల మహర్షి ప్రయాణం చేస్తూ భక్తరపల్లి, జిల్లేడుగుంట గ్రామాల మధ్య ఉన్న రామాలయం వద్ద విశ్రాంతి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ప్రయాణాన్ని కొనసాగిస్తూ అర కిలోమీటరు దూరంలో ఉన్న భక్తరపల్లి వద్ద తన వద్ద ఉన్న లక్ష్మీనరసింహస్వామి సాలగ్రామాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని భక్తులు ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు. అలాగే భక్తరపల్లికి కిలోమీటరు దూరంలో ఉన్న జిల్లేడుగుంట ఆంజనేయస్వామి దేవాలయానికీ దివ్యమైన చరిత్ర ఉంది. 1447–1539 మధ్య కాలంలో వ్యాసరాయ మహర్షి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి, యంత్రోద్ధారక ప్రాణప్రతిష్ట చేసినట్లుగా పూర్వీకులు చెబుతున్నారు. ఏటా మార్గశిర శుద్ద త్రయోదశి నుంచి బహుళ విదియ వరకు ఈ రెండు ఆలయాల పరిధిలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వస్తుంటారు. వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భూతప్ప, జ్యోతుల ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
30 నుంచి ప్రారంభం
భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 1న ధ్వజారోహణం, ప్రత్యేక హోమాలు, 2న హోమం, 3న కల్యాణోత్సవం, 4న బ్రహ్మరథోత్సవం, 5న భూతప్పలు, జ్యోతుల ఉత్సవం, 6న పూల పల్లకీ, గరుడ ఉత్సవాలు, 7న కంబాల నరసింహస్వామికి జ్యోతుల ఉత్సవం, 8న వసంతోత్సవం, చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
30 నుంచి భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ప్రత్యేక ఆకర్షణగా భూతప్ప, జ్యోతుల ఉత్సవాలు
ఆధ్యాత్మిక కల్పవల్లి.. భక్తరపల్లి


