మళ్లీ తెరపైకి ఈ–స్టాంప్ కుంభకోణం
కళ్యాణదుర్గం: రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ స్టాంప్‌ల కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. కళ్యాణదుర్గం కేంద్రంగా సాగిన ఈ బాగోతం తాజాగా చర్చనీయాంశమైంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య వేసిన పిల్‌ను బుధవారం హైకోర్టులో విచారణకు స్వీకరించడంతో కళ్యాణదుర్గం టీడీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ పరిణామంతో ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఉలిక్కిపడినట్లు తెలిసింది.
రూ.కోట్ల స్టాంపు డ్యూటీ ఎగవేత..
ఈ–స్టాంప్ కుంభకోణంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ కంపెనీ పాత్రపై అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది బ్యాంకుల నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీనికోసం ముందుగా స్టాంప్ డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ స్టాంప్ పొందాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, ఎస్‌ఆర్‌సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా కేవలం రూ.1,51,700 చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించకపోవడం గమనార్హం.
మీ సేవా సెంటర్ నిర్వాహకుడిపై నెపం..
కళ్యాణదుర్గంలో మీ సేవ సెంటర్ నిర్వహించే బాబు (యర్రప్ప)ను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఈ స్టాంప్ బాగోతం నడిపించిందనే విమర్శలు ఉన్నాయి. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకులు, ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాలకు బురిడీ కొట్టి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టి.. చివరికి కుంభకోణం బయటకు రావడంతో నెపమంతా మీ సేవా సెంటర్ నిర్వాహకుడిపైకి నెట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. ‘అధికార’ దర్పంతో పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని తప్పంతా మీ సేవ నిర్వాహకుడిదే అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని, చివరికి మీ సేవ బాబు అలియాస్ బోయ యర్రప్ప, అతని భార్య కట్టా భార్గవిపై పోలీసు కేసు కూడా నమోదు చేయించినట్లుగా తెలుస్తోంది. రూ.కోట్ల కుంభకోణం బయటకు రావడంతో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు నియోజకవర్గంలో సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తున్నానంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నానే విమర్శలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో తీవ్ర చర్చ..
ఈ స్టాంప్ కుంభకోణంపై మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వేసిన పిల్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించడంతో ఒక్కసారిగా కళ్యాణదుర్గం టీడీపీలో అలజడి మొదలైనట్లు తెలిసింది. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపితే నియోజకవర్గంలో అసలు దోషులు ఎవరు తేలుతుందన్న చర్చ అధికార టీడీపీ లోనే సాగుతుండడం గమనార్హం.
వైఎస్సార్ సీపీ నేత తలారి రంగయ్య పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
‘దుర్గం’ టీడీపీలో అలజడి
ఉలిక్కిపడిన ఎమ్మెల్యే అమిలినేని


