పుట్టపర్తి టౌన్: సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలగబోనివ్వమని, ఈ మేరకు విస్తృత స్థాయిలో మౌలిక, రవాణా సౌకర్యాలు కల్పించామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన ప్రశాంతి నిలయం, రైల్వే స్టేషన్, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు. అలాగే శిల్పారామంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిని ఎగ్జిబిషన్ స్టాళ్లను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సత్యసాయి శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండువగా ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాట్లు పటిష్టంగా చేశామన్నారు. రైల్వేస్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు ఉచిత బస్సులు నడుపుతున్నామన్నారు. అలాగే సమీప ప్రాంతాల నుంచి కూడా 300 స్పెషల్ బస్సు సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 165 రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాలతో పాటు పట్టణ పరిసరాల్లో ఫుడ్ కౌంటర్లు, మెడికల్ క్యాంపులు, తాగునీరు, రాత్రి వేళల్లో లైటింగ్ సౌకర్యం కల్పించామన్నారు. అలాగే శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్న నేపథ్యంలో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్ వెల్లడి


