సమ్మోహనం.. సత్యసాయి వైభవం
ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో రెండోరోజైన శుక్రవారం సాయంత్రం సత్యసాయి సన్నిధిలో నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను సమ్మోహన పరిచింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు రూపా పనేసర్ తన బృందంతో కచేరీ నిర్వహించారు. సితార్ వాయిద్యంతో ఆమె పలికించిన శృతులతో భక్తకోటిని పరవశింపజేసింది. సత్యసాయిని, సర్వదేవతలను కొనియాడుతూ ఆమె సితార్ తంత్రులు మీటగా తబలా, గిటార్‌తో బృందంలోని సభ్యులు జత కలిశారు. ఇలా రెండు గంటల పాటు సాగిన కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపోయింది. వీనుల విందైన ఈ కార్యక్రమంతో అందరూ మైమరచిపోయారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
‘సిమ్స్’ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి అత్యాధునిక యంత్రాలు..
సత్యసాయి మానవాళికి విద్య, వైద్యం, తాగునీరు రంగాలలో నాణ్యమైన సేవలు ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో పని చేశారని, ఆయన స్థాపించిన వ్యవస్థను మరింత ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పనిచేస్తోందని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం ప్రశాంతి గ్రాం వద్ద ఉన్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (సిమ్స్)లోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని ఆధునికీకరించి మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు రూ.2.45 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎండోస్కోపీ వ్యవస్థను ఆర్‌జె.రత్నాకర్ రాజు సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సత్యసాయి శతజయంతి వేడుకల సమయంలో సిమ్స్‌లో వైద్య సేవలు మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టడం సంతోషదాయకమన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఇటీవల రూ.కోట్లు వెచ్చించి సిమ్స్‌లోని అన్ని విభాగాలను ఆధునికీకరించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ‘సిమ్స్’ డైరెక్టర్ డాక్టర్ గురుముర్తి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శత జయంత్యుత్సవాల్లో
రెండోరోజు సంగీత విభావరి
సంగీత స్వరాలతో అలరించిన
రూపా పనేసర్
సమ్మోహనం.. సత్యసాయి వైభవం
సమ్మోహనం.. సత్యసాయి వైభవం


