డిగ్రీ ఢమాల్!
అనంతపురం: చంద్రబాబు సర్కార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చెల్లించకపోవడంతో పాటు డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రూ.90 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా, రూ.30 కోట్లు మాత్రమే చెల్లించింది. దీంతో డిగ్రీ కళాశాలలను నిర్వహించడం కష్టమవుతోందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూసివేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు సైతం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లపై దృష్టి సారించలేదు. దీంతో డిగ్రీ అడ్మిషన్లు భారీగా పడిపోయాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్కేయూ పరిధిలోని కళాశాలల్లో పీజీలో 10 శాతం, డిగ్రీలో 30 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంత ఘోరంగా అడ్మిషన్లు కావడం చరిత్రలో ఇదే తొలిసారి.
అధునాతన డిగ్రీ కోర్సుల అమలేదీ?
డిగ్రీ కోర్సుల ట్రెండ్ మారింది. బీఏలో గతంలో ఐదారు రకాల కోర్సులు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం 68 రకాల కోర్సులు ఉన్నాయి. ఇవి కాకుండా బీబీఎం, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషన్ (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ, టూరిజం, పరిపాలన) కోర్సులు విస్తరించాయి. బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా అప్లికేషన్ కోర్సులున్నాయి. కానీ కేవలం సంప్రదాయ కోర్సులు మాత్రమే అమలు చేస్తుండడంతో విద్యార్థులు వీటిపై ఆసక్తి చూపడం లేదు.
అడ్మిషన్లపై సర్కారు నిర్లక్ష్యం..
డిగ్రీ అడ్మిషన్లు తగ్గితే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే అవసరం ఉండదనే భావనలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అడ్మిషన్లు పెరగకుండా నీరుగారుస్తోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
30 శాతం సీట్లు మాత్రమే భర్తీ
పీజీలో 10 శాతం మాత్రమే అడ్మిషన్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో సర్కార్ నిర్లక్ష్యం
కళాశాలల నిర్వహణ కష్టమంటున్న యాజమాన్యాలు


