పుట్టపర్తికి నిరంతర విద్యుత్
తిరుపతి రూరల్: సత్యసాయి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ప్రశాంతి నిలయంతో పాటు పుట్టపర్తికి నిరంతర విద్యుత్ సరఫరాకు ఏపీ ఎస్పీడీసీఎల్ చర్యలు తీసుకుందని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు. అందువల్లే ప్రశాంతి నిలయంలో విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతోందన్నారు. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును పుట్టపర్తికి అందించేందుకు ఏపీ ఎస్పీడీసీఎల్ తరఫున చేపట్టిన చర్యలను శుక్రవారం ఆయన మీడియాకు వివరించారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని ముందుగానే అంచనా వేసి అందుకనుగుణంగా ప్రత్యేకంగా వెంగలమ్మచెరువు వద్ద 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. అధిక లోడ్‌ను తట్టుకునేందుకు వీలుగా ఆ సబ్‌స్టేషన్‌లో 28ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు పవర్ బ్యాకప్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యు్‌త్ సరఫరాలో అంతరాయం తలెత్తితే సరఫరా పునరుద్ధరణ కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అదనంగా ప్రశాంతి–1, ప్రశాంతి–2, ఉజ్వల ఫీడర్లును అందుబాటులోకి తెచ్చి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలుగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. పుట్టపర్తిలో ప్రస్తుతం 100, 160, 315, 500 కేవీఏ సామర్థ్యం కలిగిన మొత్తం 72 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా గృహ, వాణిజ్య వినియోగదారులకు విద్యుత్తును సరఫరా అందిస్తున్నట్టు సీఎండీ వెల్లడించారు. అలాగే మందిర ప్రాంగణంలోని కండక్టర్ల మార్పు, జర్మన్ హ్యాంగర్ షెడ్లకోసం 100, 160 కేవీఏ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. శ్రీసాయి రథయాత్రకు ఇబ్బంది కలగకుండా లైన్ల మార్పు చేశామన్నారు. ఇక పోలీస్ అధికారుల విధులకు ఆటంకం ఏర్పడకుండా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచామని, పోలీసుల వసతి కేంద్రాల్లో కూడా కొత్త ట్రాన్స్ ఫార్మర్లను, విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం రూ. 7.20 కోట్ల వెచ్చించినట్లు సీఎండీ వివరించారు.
ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్


