పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
పుట్టపర్తి టౌన్: మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు, తెలుగు తమ్ముళ్ల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నాయకులు ఒకానొక దశలో రెచ్చిపోయి పోలీసులపై భౌతిక దాడులకు దిగారు. అనంతపురం జిల్లా పర్యటన నిమిత్తం మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రత్యేక విమానంలో ముందుగా సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయంలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను అనుమతించారు. లోకేష్ విమానాశ్రయానికి చేరుకోకముందే రాష్ట్ర మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాశ్ నాయుడు తన అనుచరులతో కలసి ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చారు. పోలీసులు ఆయన్ను విమానాశ్రయంలోకి అనుమతించలేదు. ‘మేం అధికార పార్టీ నాయకులం. అనుమతి తీసుకోం. లోపలికి పంపాల్సిందే. లేదంటే మీ అంతు చూస్తాం’ అంటూ సీఐలు ఆంజనేయులు, బొజ్జప్పను ప్రకాశ్ నాయుడు బెదిరించారు. దీంతో అక్కడున్న పోలీసులు కూడా ప్రతిఘటించారు. విచక్షణ కోల్పోయిన టీడీపీ నాయకులు పోలీసులపై భౌతిక దాడులకు దిగారు. ఇంతలోనే అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మహవీర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. మంత్రి హోదాలో వచ్చిన లోకేష్‌కు సీఎం స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
పోలీసులు, తెలుగు తమ్ముళ్ల మధ్య తోపులాట
పోలీసులపై భౌతిక దాడులకు దిగిన టీడీపీ నేతలు


