శత జయంతికి రైల్వేస్టేషన్ ముస్తాబు
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ప్రశాంతినిలయం రైల్వేస్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. బాబా శత జయంతి వేడుకలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుండగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రైలు మార్గం గుండా ప్రశాంతి నిలయం విచ్చేయనున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ కూడా ఈనెల 13వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకూ నిత్యం ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌ను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. గెస్ట్ హౌస్, విశ్రాంతి గదులు సిద్ధం చేశారు. భక్తులను ఆకట్టుకునే విధంగా ముఖద్వారం తీర్చిదిద్దుతున్నారు. రైల్వేస్టేషన్ ఎదురుగానే శత జయంతి లోగో, బాబా చిత్రపటాలు, పూర్ణకుంభం ఏర్పాటు చేశారు. సుమారు 40కిపైగా మరుగుదొడ్లు, యూరినల్స్ నిర్మించారు. ఇక విశ్రాంత గదులు నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇటీవల క్యాంటీన్, లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కూర్చోవడానికి అవసరమైన షెడ్ల నిర్మాణం పూర్తవుతోంది. రైల్వే ప్లాట్‌ఫాం కూడా నూతనంగా తీర్చిదిద్దారు. ఎంత మంది వచ్చినా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ సతీష్‌రెడ్డి చెప్పారు.
నేటి నుంచి గ్లోబల్ అఖండ భజన
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం నుంచి గ్లోబల్ అఖండ భజన కార్యక్రమం ప్రారంభమవుతుందని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రశాంతి భజన గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుందన్నారు. భక్తులు సత్యసాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చన్నారు.


