
వక్కచెట్ల నరికి వేత
న్యూస్‌రీల్
● రూ.లక్ష నష్టం..
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
రొళ్ల: మండల పరిధిలోని హనుమంతనపల్లి గ్రామంలో రైతు రంగనాథ్ వక్కతోటలోని 50 చెట్లను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. వివరాల్లోకి వెళితే.. రంగనాథ్ నాలుగేళ్ల క్రితం వక్క చెట్లను నాటాడు. అప్పటి నుంచి మొక్కలకు సకాలంలో నీరు, ఎరువులు అందిస్తూ వచ్చాడు. ప్రస్తుతం పంట కాపునకు వచ్చింది. శుక్రవారం కూడా రంగనాథ్ తన తండ్రి గోవిందప్పతో కలిసి వక్కతోట వద్దకు వెళ్లి సాయంత్రం వరకు పనిచేశాడు. అనంతరం ఇంటికి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వక్కతోటలోకి ప్రవేశించి కాపునకు వచ్చిన 50 చెట్లను నరికి వేశారు. శనివారం ఉదయం తోటకు వెళ్లిన రంగనాథ్ తెగిపడిన వక్కచెట్లను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రొళ్ల ఏఎస్‌ఐ ఇదాయతుల్లా ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్లుగా మొక్కలను కంటికిరెప్పలా కాపాడుకున్నానని, ఇప్పటికే రూ.లక్ష దాకా ఖర్చు చేశానని బాధితుడు రంగనాథ్ తెలిపారు. సరిగ్గా కాపునకు వచ్చిన సమయంలో ఇలా నరికివేశారని, వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.