
జాతీయ స్థాయి పోటీలకు కదిరి విద్యార్థులు
కదిరి అర్బన్: ఈ నెల 29 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలో జరిగే జాతీయ స్థాయి గోల్‌షూట్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లిలో ఉన్న హరీష్ పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ కిరణ్ శుక్రవారం తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు శైలజ, హిమబిందు, అర్థిక ఎంపికయ్యారన్నారు. ఎంపికై న విద్యార్థులను గోల్ షూట్‌బాల్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసన్నకుమార్, ఖాదర్‌వలీ తదితరులు అభినందించారు.
పదో తరగతి విద్యార్థుల బాహాబాహీ
కదిరి టౌన్: స్థానిక అడపాల వీధిలో ఉన్న షిరిడీ సాయి స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గురువారం సాయంత్రం అదే పాఠశాల సమీపంలో గొడవపడి పరస్పరం దాడులు చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన మరో విద్యార్థిపై కేసు నమోదు చేసేందుకు సీఐ నారాయణరెడ్డి సిద్ధం కాగా, విద్యార్థి తల్లి ఆందోళనకు గురైంది. పిల్లవాడి భవిష్యత్తు నాశనం అవుతుందని, రాజీ పరిష్కారం చేయాలని వేడుకుంది. అక్కడితో ఆగకుండా క్షణికావేశానికి లోనై బ్లేడుతో తన చేతికి కోసుకుంది. తీవ్ర గాయమైన ఆమెను పోలీసులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పరస్పర ఫిర్యాదుల మేరకు ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
వినాయకుడి విగ్రహం అపహరణ
అగళి: స్థానిక శంకేశ్వరస్వామి ఆలయం ఆవరణలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. శుక్రవారం ఉదయం నిత్య పూజలు చేసేందుకు వెళ్లిన అర్చకుడు విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్షుద్రపూజలు చేసిన అనంతరం వినాయకుడి విగ్రహాన్ని పెకలించుకుని వెళ్లినట్లుగా ఆనవాళ్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీంను రంగంలో దించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

జాతీయ స్థాయి పోటీలకు కదిరి విద్యార్థులు