
రెండేళ్లలో తుమకూరు–రాయదుర్గం రైల్వే లైన్ పూర్తి
మడకశిర: రాయదుర్గం–తుమకూరు రైల్వే లైన్ పనులను 2027లోపు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న వెల్లడించారు. శుక్రవారం ఆయన హిందూపురం ఎంపీ పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో మడకశిర వద్ద తుమకూరు–రాయదుర్గం రైల్వే పనులను కలిసి పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. రాయదుర్గం–తుమకూరు రైల్వే లైన్ మధ్య మొత్తం 14 రైల్వే స్టేషన్లు ఉంటాయని, అందులో మడకశిర మండలంలోని కొత్తలం, మడకశిరలోనూ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయిన వెంటనే తుమకూరు–దావణగెర రైల్వే లైన్ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సర్వే, భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.47 వేల కోట్లతో 31 ప్రాజెక్టుల ద్వారా 3,840 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఇందులో 1,600 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. తుమకూరు– బెంగళూరు– బెంగళూరు– తమిళనాడు మధ్య రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు చేపట్టడానికి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తుమకూరు– దావణగెర మధ్య
రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు
రూ.47 వేల కోట్లతో 3,840 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి
సోమన్న వెల్లడి