
ఐక్య ఉద్యమాలతో చేనేత పరిరక్షణ
అనంతపురం అర్బన్: ఐక్య ఉద్యమాలతోనే చేనేత రంగం పరిరక్షణ సాధ్యమవుతుందని, ఈ మేరకు ఉద్యమ కార్యచరణను రూపొందిస్తున్నట్లు చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, గోవిందు తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో చేనేతలకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత కూటమి పెద్దలు తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి చేనేత రంగం నిర్వీర్యమవుతోందన్నారు. నేతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి భరోసా ఇవ్వలేదన్నారు. మంత్రుల సొంత ఇలాకాలోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. చేనేతను రక్షించుకోవడం అంటే దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని రక్షించుకునే లక్ష్యంగా ఉద్యమాలు సాగిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో అధ్యయన యాత్ర చేపట్టి, ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ధర్మవరం పట్టణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, నేతన్న నేస్తం కింద రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని తక్షణమే అమలు చేయాలని, నేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేనేత పెన్షన్, ప్రత్యేక చేనేత బ్యాంక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మధు, పురుషోత్తం, రాధాకృష్ణ, రామ్మోహన్ నాయుడు, సూర్యానారాయణ, తదితరులు పాల్గొన్నారు.
చేనేతలకిచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం
ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో
ఈ నెల 24, 25న అధ్యయన యాత్ర
చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు