
కేంద్ర మంత్రి పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్
మడకశిర రూరల్: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్ పతాక స్థాయికి చేరుకుంది. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ రెన్యూవల్ చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులను అడుగడుగునా అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి శుక్రవారం మడకశిర ప్రాంతాలో కేంద్ర మంత్రి సోమన్న పర్యటించారు. దీంతో మంత్రిని కలిసి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ రెన్యూవల్ చేయాలంటూ అభ్యర్థించేందుకు జిల్లా వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ హనుమంతు, సర్పంచ్ కరియన్న, బీసీసెల్ నాయకుడు తిమ్మప్ప పార్టీ వివిధ విభాగాల సభ్యులు శివానంద, లక్ష్మీనారాయణ, నాగభూషణరెడ్డి, రంగనాథ, హరి ప్రసాద్, దేవరాజ్, మైలారప్ప, రామకృష్ణప్ప తదితరులు సిద్ధమయ్యారు. తొలుత మడకశిరలోని వాల్మీకి సర్కిల్ వద్ద మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వేచి ఉండగా పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని బుకాయించి వెనక్కు పంపారు. దీంతో పెనుకొండ రోడ్డులో మరోసారి వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయత్నంచారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. హరేసముద్రం క్రాస్ వద్ద హైవేలో వేచిఉండగా అక్కడ ఇవ్వడానికి వీలులేదని, రైల్వేస్టేషన్ నిర్మాణ ప్రాంతంలో ఇవ్వాలంటూ పంపించేశారు. రైల్వేస్టేషన్ చేరుకుని మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించినా అక్కడ కూడా అవకాశం కల్పించకుండా అడ్డుకున్నారు. వెటర్నరీ కాలేజీ వద్దనూ షరామాములైంది. దీంతో ఆంధ్ర సరిహద్దున కర్ణాటక పరిధిలోని చంద్రబావి గ్రామ సమీపానికి వెళ్లి రోడ్డుపైనే మంత్రికి వినతి పత్రం అందజేశారు. మడకశిర ప్రాంతంలో వినతిపత్రం ఇవ్వడానికి అనుమతించని పోలీసుల వైఖరిని మంత్రికి వివరించారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేసి పేదలను ఆదుకోవాలని విన్నవించారు.
మంత్రిని కలవడకుండా వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకున్న వైనం
సరిహద్దుకు వెళ్లి కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చిన నాయకులు