
భౌ.. బాబోయ్!
● కదిరి జీవిమాను కూడలిలో ఈ నెల 7వ తేదీన అఫ్రిన్ అనే ఐదేళ్ల చిన్నారిని వీధి కుక్క కరిచి తీవ్రంగా గాయపరచింది. కుటుంబీకులు చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుడి సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. అంతకుముందు అడపాల వీధిలో ఒకేరోజు రాత్రి వేళ కుక్కలు 17 మంది చిన్నారులతో పాటు మరో మహిళను కూడా తీవ్రంగా గాయపరిచాయి.
● హిందూపురం మోడల్ కాలనీలో ఇటీవల వీధి కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. పట్టణంలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తున్న శునకాలు చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. పెనుకొండలోనూ వీధి కుక్కలు పెరిగిపోగా, ఇటీవల కుక్కకాటు బాధితుల సంఖ్య భారీగా పెరిగింది.
కదిరి: జిల్లాలో శునకాల సంతతి ఇటీవల బాగా పెరిగింది. జిల్లాలోని ఏ వీధిలో చూసినా కుక్కల మందలే కనిపిస్తున్నాయి. ఇలా వీధుల్లో తిష్టవేస్తున్న శునకాలు దారి వెంట వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో బైక్‌ల వెంట బడుతూ తీవ్రంగా భయపెడుతున్నాయి. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట...ఎవరో ఒకరు కుక్కకాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను రోడ్డు పక్కన పడేయటంతో పదుల సంఖ్యలో కుక్కలు చేరి, పోట్లాడుకొని ఆఖరకు అడ్డొచ్చిన జనాన్ని కరుస్తున్నాయి. గత 8 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 2,406 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఇక నమోదు కాని కేసులు మరో 1,000 దాకా ఉండచ్చని అధికారులే చెబుతున్నారు. ఇక మూగ జీవాలను కూడా కుక్కలు వదలడం లేదు.
పెంపుడు కుక్కల వివరాలను ఆయా మున్సిపాలిటీల్లో నమోదు చేయించాల్సి ఉన్నా.. జిల్లాలో ఎక్కడా నమోదు చేయడం లేదు. ఇక వీధి కుక్కల సంఖ్య ఎంత ఉందని చెప్పడం కూడా కష్టమేనని సంబంధిత అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో 1,484 పెంపుడు కుక్కలు, 27,099 వీధి కుక్కలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటికి తోడు మండలాల పరిఽధిలోని గ్రామాల్లోని కుక్కలను సైతం లెక్కిస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు 1.60 లక్షల పెంపుడు, వీధి కుక్కలు ఉండచ్చని తెలుస్తోంది.
కుక్కల్ని చంపడానికి నిబంధనలు ఒప్పుకోవు. అందుకే స్టెరిలైజేషన్ (ఆపరేషన్) చేసి వాటి సంతతిని తగ్గిస్తారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఈ ప్రక్రియ సాగడం లేదు. కూటమి ప్రభుత్వంలో కుక్కల నియంత్రణకు నిధుల కొరత ఉందని ఆయా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుక్కకు కు.ని శస్త్ర చికిత్స చేయాలంటే రూ.500 ఖర్చు అవుతుందంటున్నారు. ఈ లెక్కన కోట్లలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని వారంటున్నారు. ఇక పంచాయతీల పరిధిలో కుక్కలకు కు.ని ఆపరేషన్ల సంగతి చెప్పనక్కర లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక కుక్కల స్టెరిలైజేషన్ కోసం నిధులు విడుదల చేసిన దాఖలాల్లేవు.
కుక్కకాటు బాధిత సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. జిల్లా కుక్కకాటుకు వేసే రేబిస్ వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్క కాటుకు మందులు లేవని వైద్యులే చెబుతున్నారు. ఇక సీహెచ్‌సీలు, పట్టణాల్లోని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అంతమాత్రంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో చాలా మంది పురాతన పద్ధతులైన వాతలు పెట్టుకోవడం...పసరు తాగడం చేస్తున్నారు. కానీ కుక్కకాటు బాధితులు సకాలంలో వ్యాక్సిన్ వేసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
కదిరిలో సంచరిస్తున్న వీధి కుక్కలు
కుక్కలు కొరికేస్తున్నాయ్
వీధుల్లోకి రావాలంటేనే భయపడుతున్న జనం
బైక్‌పై వెళ్తున్నా తప్పని కుక్క కాటు
8 నెలల్లోనే 2,406 కేసుల నమోదు
అనధికారికంగా ఈ లెక్క
మరింత ఎక్కువే
పశువులనూ వదిలి పెట్టని గ్రామ సింహాలు
రేబిస్ టీకాల సరఫరా
అంతంత మాత్రమే
నిధుల కొరతతో కు.నికి పాట్లు
రేబిస్ వ్యాక్సిన్‌కూ దిక్కులేదు
జిల్లాలో 1.60 లక్షల శునకాలు
...ఇలా జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ వీధి కుక్కలు
స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ ఒంటిరిగా వెళ్లే వారిపై
దాడి చేస్తున్నాయి. ఇటీవల కుక్కకాటు బాధితులు సంఖ్య భారీగా పెరగుతుండగా..ఆస్పత్రుల్లో రేబీస్ వ్యాక్సిన్
అరకొరగా ఉంటోంది.

భౌ.. బాబోయ్!